ప్రశ్నించడం చంద్రబాబు తప్పా ? : డీజీపీకి వర్ల రామయ్య లేఖ

-

చంద్రబాబు వ్రాసిన లేఖకు పోలీసులు స్పందించిన తీరు గర్హనీయమని డీజీపీకి వర్ల రామయ్య మరో లేఖ వ్రాసారు. పోలీసు శాఖకు కేసుల దర్యాప్తులో అసలు ముద్దాయిలను త్వరితగతిన అరెస్టు చేయమని చంద్రబాబు లేఖలో కోరడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన ‘‘భావస్వేచ్చా హక్కును’’ హరించేదిగా పోలీసు వ్యవస్థ తీరు ఉన్నదని అన్నారు. రాజమండ్రిలో పదేళ్ళ ముస్లిం బాలికను బలవంతం చేయడానికి ప్రయత్నించిన ముద్దాయిల అరెస్టులో జాప్యమెందుకని ప్రశ్నించడం చంద్రబాబు చేసిన తప్పా? అని ప్రశ్నించిన ఆయన సంఘటన రిపోర్టు చేసిన తరువాత ఎన్నిరోజులకు కేసు రిజస్టరు చేశారని ప్రశ్నించారు.

ముద్దాయిలను ఎప్పుడు అరెస్టు చేశారు ? బాధితుల ఇంటిపై దాడి చేసి ఫిర్యాదు వాపసు తీసుకోమని బాలిక తల్లిదండ్రులను బెదిరించింది నిజం కాదా? సంఘటన జరిగిన నాటి నుండి ముద్దాయిలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు బాధిత కుటుంబాన్ని బయటకు రాకుండా కాపలా కాసింది నిజం కాదా? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. దర్యాప్తులు పర్యవేక్షిస్తున్న సీనియర్ పోలీసు అధికారులు కాకుండా ఆఫీసులో కూర్చునే టెక్నికల్ డిఐజి కేసుల గురించి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును తప్పు పట్టడం సబబా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి కైనా డీజీపీ ఈ కేసులన్నింటిని సమీక్షించి రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్నిస్తూ యాక్షన్ టెకెన్ రిపోర్ట్ (ATR) ప్రజల ముందుంచాల్సిందిగా కోరుతున్నామని ఆయన అన్నారు. ఇన్ని లేఖలు వ్రాసినా చంద్రబాబు ఏ ముద్దాయి పేరు చెప్పటంగానీ, సూచించటం గానీ జరగలేదని, అసలు సిసలైన నేరస్థులను అరెస్టు చేయమని కోరటంకూడా తప్పా? అని వర్ల ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version