ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కామారెడ్డిలో శుక్రవారం నాడు జరిగిన కాంగ్రెస్ సభలో హనుమంతరావు (వీహెచ్) ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రసంగం ముగిసిన తర్వాత హనుమంతరావు మాట్లాడారు.కాంగ్రెస్ లో ఎవరికి వారే నేనే సీఎం అంటున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు నేనే సీఎం అనడం మానేయాలని ఆయన కోరారు. సీఎం ఎవరనే విషయాన్ని సోనియా, రాహుల్ గాంధీ, మాణిక్ రావు ఠాక్రే, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారన్నారు. ముందు ఎమ్మెల్యేలుగా గెలవాలని ఆయన సూచించారు. ఠాక్రేజీ నేతలందరికీ ఈ సీఎం గోల ఆపమని చెప్పాలని ఆయన కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డి… రెండు నియోజకవర్గాలలో గెలుస్తాడని, కానీ ఆయన గెలిచిన తర్వాత కొడంగల్‌ను వదిలిపెట్టి, కామారెడ్డిలోనే ఉండాలని వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కోదండరాం కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తే క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం మేం కూడా కొట్లాడామన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్, ఆయన కుటుంబం నాంపల్లి దర్గా వద్ద కూర్చొని అల్లాకే నామ్ పే దేదా బాబా… అని అడుక్కునే వారన్నారు. బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ.. తాము 52 శాతానికి పైగా ఉన్నామని, కాస్త లెక్కతో నిధులు ఇవ్వాలన్నారు.