ఏపీ రాజకీయాలపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో నన్ను మీడియా మిత్రులు విశాఖపట్నంలో అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలలో ఒక అంశం ఇప్పటికీ ప్రస్తావనార్హంగానే ఉందన్నారు.
ఏ ఒక్క సామాజికవర్గానికి నేను వ్యతిరేకం కానప్పటికీ, అణచివేతకు చిరకాలంగా గురిచేయబడ్డ, అన్ని వర్గాల ప్రజలూ ఉన్నతంగా గౌరవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిగా… నాటి ఉమ్మడి ఏపీలో రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాలు, రాజ్యాధికారం అంటే కూడా అంతే అనే వ్యవస్థ మారాలంటే బడుగు, బలహీన, అట్టడుగు సముదాయాల జనబాహుళ్యం తమ రాజ్యాధికార హక్కు సమంజస స్థాయిలో సాధించగలగాలంటే రెండు రాష్ట్రాలే ప్రత్యామ్నాయం అని చెప్పానన్నారు.
ఆ మార్పు దిశగా తెలంగాణలో బీజేపీ సమీపిస్తున్నది. ఏపీలో కూడా జనసేన, బీజేపీలు, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల రాజ్యాధికార అర్హతను సాకారం చెయ్యగలిగే విజయాన్ని చేరుకుంటే, 18 సంవత్సరాల ముందు నుండీ నేను చెప్పదలుచుకుంటున్నది… చెబుతున్నది సార్ధకం అవుతున్నదని విశ్వసిస్తున్నాను అని వెల్లడించారు విజయశాంతి.