దక్షిణ భారతదేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్‌లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్ Vijayawada Railway Station సరికొత్త రికార్డు సృష్టించింది. విద్యుత్ ను ఆదా చేయడంలో మరో ముందడుగు వేసింది. 130 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించింది.
కాగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో 2019 డిసెంబర్‌లో 4, 5 ప్లాట్‌ఫారాలపై 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా అదనంగా రూ.62 లక్షలతో 4, 5 ప్లాట్‌ఫారాలలో 54 కిలోవాట్స్ , 8, 9 ప్లాట్‌ఫారాలలో 11 కిలోవాట్స్ మొత్తం 65 కిలోవాట్స్ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్ ప్యానల్స్‌తో ప్లాట్ ఫారాల పైకప్పులు ఏర్పాటు చేసారు. దీంతో రైల్వేలోనే మొదటగా 130 కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుదుత్పత్తి గల స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఈ సోలార్ పవర్ ద్వారా మొత్తం స్టేషన్లోని 18 శాతం విద్యుత్ అవసరాలు తీరనున్నాయని రైల్వే మంత్రి తెలిపారు. అలానే ఏడాదికి 8.1 లక్షల రూపాయలకు పైగా డబ్బు ఆదా కానుందని అన్నారు. సోలార్ ప్యానల్స్ ద్వారా కార్బన్ ఉద్గారాల ఉత్పత్తి కూడా తగ్గుతుందని ట్వీట్ చేసారు. ప్రయాణికులకు కూడా షెల్టర్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసారు.