మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. హుజురాబాద్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని అధికార టీఆర్ఎస్ TRS తీవ్ర పట్టుదలతో ఉంది. దీని కోసం గత కొద్ది రోజులుగా హుజురాబాద్‌పై టీఆర్ఎస్ దృష్టి సారించింది. రాబోయే ఉపఎన్నికే లక్ష్యంగా వివిధ సంఘాలతో సమావేశమవుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ హుజురాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచూ స్థానిక నేతలతో సమావేశమవుతూ నియోజకవర్గ పరిస్థితులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా శుక్రవారం మంత్రి గంగుల, హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్ లో జిల్లా రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీఆర్ఎస్ గెలుపులో రైస్ మిల్లర్లు కీలకభూమిక పోషించాలని కోరారు. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కు పట్టం కట్టాలన్నారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని.. టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి గెలిచినట్లని అన్నారు. అలానే ఈటలపై కూడా మంత్రి గంగుల విమర్శలు గుప్పించారు. ఈటల హయాంలో హుజురాబాద్ అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. ప్రధాన రహదారులన్నీ గుంతలమయమయ్యాయని అన్నారు. కేసీఆర్ ను ఎదురిస్తే ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఈటల ఆశపడ్డారని ఆరోపించారు.