గత రెండు దశాబ్దాలుగా తిరుగులేని విధంగా రాజకీయం చేస్తోన్న గంటాకు ఏనాడు బ్రేక్ పడలేదు. గంటా టీడీపీలో ఉన్నా, ప్రజారాజ్యంలో ఉన్నా, మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లినా, తిరిగి టీడీపీలోకి వచ్చినా అధికారం ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండేది. అయితే గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా టీడీపీ ఓడిపోయింది. అప్పటి నుంచి ఆయన రాజకీయం మాత్రం సాఫీగా సాగడం లేదు. ఎందుకో గంటా అధికార పార్టీలోకి వచ్చేందుకు గతంలో ఎప్పుడు ప్రయత్నాలు చేసినా ఆయనకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించేవారు. ఇప్పుడు మాత్రం గంటా వైసీపీ ఎంట్రీకిఇ పదే పదే బ్రేకులు పడుతున్నాయి. ఆయన ఏ ప్రయత్నం చేసినా కూడా ముందుకు సాగడం లేదు.
ఎన్నికలకు ముందు ఎప్పుడు అయితే గంటా శిష్యుడు అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి వెళ్లారో అప్పుడే గంటాకు పెద్ద దెబ్బ పడిపోయింది. ఐదేళ్ల పాటు గంటా మంత్రిగా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. అప్పుడు అనకాపల్లి ఎంపీగా ఉన్న నేటి మంత్రి అవంతి గంటాతో విబేధించి వైసీపీలోకి వెళ్లి నేడు మంత్రి అయ్యారు. ఇక మంత్రి అవంతితో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇద్దరూ గంటా ఎంట్రీని అడ్డుకుంటున్నారు. గంటా ఇలా లాభం లేదని రాష్ట్ర స్థాయి వైసీపీ నేతలతో తనకు ఉన్న పరిచయాలు వాడుకుని నేరుగా జగన్ ద్వారా లాబీయింగ్‌కు కూడా విశ్వప్రయత్నాలు చేశారు.
అయితే వాటన్నింటిని విజయసాయి తిప్పికొట్టారని… గంటా పార్టీ మార్పునకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాస్ట్ బాల్ వేసినా విజయసాయి వాటికి చక్కగా చెక్ పెట్టేశారని వైసీపీలో కీలక నేతలు చర్చించుకుంటున్నారు. గంటా ఉత్తరాంధ్రకే చెందిన మరో మంత్రి బొత్స సత్యనారాయణతో కాపు క్యాస్ట్ లాబీయింగ్ వాడి పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేసిన విషయం లీక్ కావడంతో విజయసాయి ముందే ఎలెర్ట్ అయ్యారంటున్నారు. గంటా పార్టీలోకి వస్తే క్రమంగా విశాఖ నగర రాజకీయంతో పాటు ఉత్తరాంధ్ర వ్యవహారాల్లోనూ ఆయన పట్టు క్రమంగా పెరిగిపోతుంది.
అప్పుడు విజయసాయి ప్రాభవానికి ఆటోమేటిక్‌గా గండి పడుతుంది. ఇవన్నీ తెలిసే విజయసాయి గంటా పార్టీలోకి ఎప్పటకీ రాకుండా తాను చేయాల్సింది తాను చేసేశారని అంటున్నారు. గంటాను పార్టీలో చేర్చుకునే విషయంలో జగన్ సుముఖంగా ఉన్నా విజయసాయి ఓకే చెప్పకుండా అది జరిగే పని కాదని తెలుస్తోంది. ఇక ఈ యేడాది చివరి వరకు వెయిట్ చేసి ఆ తర్వాత గంటా బీజేపీలోకి వెళ్లినా వెళ్లిపోవచ్చన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.