వైరల్‌ వీడియో: కళ్లముందే ప్రమాదం జరిగినా కన్నెత్తి చూడని కలెక్టర్..!

-

దేశంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం.. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు.. చాలా రాష్ట్రాల్లో గుంతలు రోడ్లలోనే ప్రయాణించాల్సిన పరిస్థితి.. అలాంటి ఓ దారణమైన రోడ్లో కలెక్టర్‌ కాన్వాయ్‌ వెళ్తుంది.. అటుగా వస్తున్న ఓ ఆటో.. కాన్వాయ్‌కు దారివ్వబోయి బోల్తా పడింది.. ఆ ప్రమాదం కలెక్టర్‌ చూసినా కనీసం కారు ఆపకుండా వెళ్లిపోయాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్పడింది. సీతాపుర్‌లోనూ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్‌ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఓ ఆటో సైడ్ ఇవ్వబోయింది. ఆ క్రమంలోనే అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడ్డారు. ఇంత జరిగినా కాన్వాయ్‌లో వెళ్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం కనీసం పట్టించుకోలేదు. కనీసం వాహనం దిగి ఎవరికైనా ఏమైందో కూడా చూడకుండా అలానే వెళ్లిపోయారు.

అక్కడే ఉన్న స్థానికులు వెంటనే వచ్చి సహాయం చేశారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీడియో వైరల్‌గా మారింది..కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయిన కలెక్టర్‌పై నెటిజన్లు. విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులను పట్టించుకోరా? సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను అసలు పట్టించుకుంటారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

మన తెలుగు రాష్ట్రాల్లో పాలకుల పాలన ఎలా ఉన్నా..వాళ్లు అటుగా వెళ్తుంటే మాత్రం ఎవరికైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందిస్తారు. వారిని తమ కార్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం ఇప్పిస్తారు. చిన్న చిన్న నాయకుల నుంచి రాష్ట్ర సీఎం వరకూ అందరూ ఇలా మానవత్వం చాటుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version