పెద్దాయన పై తిరుగుబాటు..విజయనగరం టీడీపీలో ఏం జరుగుతోంది ?

-

విజయనగరం జిల్లా టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎన్నోఏళ్లుగా పెద్దాయన కనుసన్నల్లో నడిచిన పార్టీ.. ఇప్పుడు ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లింది. జిల్లా కేంద్రంలో పట్టు సాధించేందుకు రాజుగారికి వ్యతిరేకంగా ఓ వర్గం పావులు కదుపుతోంది. గత కొన్నాళ్లుగా నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ పోరు రచ్చకెక్కింది. రాజుగారికి వ్యతిరేకంగా మరోవర్గం చకచకా పావులు కదుపుతోంది. ఇప్పటికే పూసపాటి ఇంటి ఆడపడుచు సంచయిత పక్కలో బళ్లెంలా తయారవ్వగా… ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఎదురుతిరగడం రాజుగారికి తలనొప్పిగా మారింది.

ఏపీలో టీడీపీకి కంచుకోటగా చెప్పుకునే జిల్లాలో విజయనగరం ఒకటి. ఈ జిల్లాలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. విజయనగరం జిల్లా నుంచి ఎన్నికైన కిమిడి మృణాలిని, సుజయ కృష్ణ రంగారావు గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేయగా.. అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేసారు. జిల్లాలో అధ్యక్షుడిగా ఎవరున్నా… సీనియర్ నేత అశోక్ గజపతి రాజు మాటే ఫైనల్‌గా ఉండేది. ఒంటి చేత్తో తన బంగ్లా నుంచే విజయనగరం టీడీపీని నడిపించేవారాయన. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీకి కార్యాలయం కూడా అవసరం లేకుండా పోయింది. అలా క్రమశిక్షణకు మారు పేరుగా ఉండే విజయనగరం తెలుగుదేశం ఇప్పుడు వర్గ పోరుతో రోడ్డుకెక్కుతోంది. తనకి సరైన గౌరవం దక్కడంలేదంటూ జిల్లా పార్టీ పెద్ద అశోక్ గజపతిరాజుకి వ్యతిరేకంగా.. ఏకంగా పార్టీ కార్యాలయం ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మీసాల గీత.

గీత కార్యాలయం ప్రారంభించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అశోక్ గజపతిరాజు. పార్టీని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందంటూ మండిపడ్డారు. వైసిపి మంత్రుల స్ట్రాటజీలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు అశోక్ గజపతి రాజు. గత ఎన్నికలకు ముందు నుంచి వర్గపోరు మొదలైనా అశోక్ గజపతికి ఎదురు తిరిగే సాహసం ఎవరూ చేయలేదు. బయటకు అందరూ బాయి బాయి అనుకున్నా .. తెరవెనుక మాత్రం ఎవరి రాజకీయం వారు చేసుకుంటూ వస్తున్నారు. అయితే, ఇటీవల అధిష్టానం ప్రకటించిన పార్టీ పదవులు జిల్లాలో కాకరేపాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సీనియర్ లను పక్కన పెట్టి కొత్తవారికి పదవులు ఇవ్వడంపై ఇప్పటికే కొందరు నేతలు బాహాటంగా విమర్శలకు దిగారు.

సీనియర్ నేతలైన శోభా హైమావతి, మాజీ మంత్రి పడాల అరుణ, కేఏ నాయుడు , మీసాల గీతలకు ఆశించిన పార్టీ పదవులు దక్కకపోవడం లుకలుకలు బయటపడ్డాయి. సీనియర్లను పక్కనపెట్టి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన వారికి పార్లమెంట్ అధ్యక్ష పదవి ఎలా ఇస్తారంటూ.. గజపతినగరం మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు బాహంటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా విజయనగరం పార్లమెంటరీ కార్యాలయం అంటూ ఓ భవనానికి కొత్తబోర్డు పెట్టేయగా … అదే దారిలో మరో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పార్టీ ఆఫీస్ తెరిచారు.

గత నాలుగు దశాబ్దాలుగా విజయనగరంలో టీడీపీ కార్యాలయంగా అశోక్ గజపతి రాజు బంగ్లానే కొనసాగుతూ వస్తోంది. పార్టీలో ఎన్ని మార్పులు వచ్చినా .. ప్రతిదీ పెద్దాయన బంగ్లా నుంచే నడిచేది. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిన గీతని కాదని.. తన వారసురాలైన అదితి గజపతి రాజుకి విజయనగరం అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించారు అశోక్ గజపతిరాజు. అప్పటి నుంచి గీత -అశోక్ గజపతిరాజుల మధ్య వార్ మొదలైంది. ఎన్నికల నాటి నుంచి ఇద్దరు నేతలు ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారు. తాజాగా పార్టీ పదవుల్లో సైతం తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని గీత గుర్రుగా ఉన్నారు. జిల్లాలో అధికంగా ఉన్న తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన తనకి రాజుగారు తగిన గౌరవం ఇవ్వడం లేదన్న ఆగ్రహంతోనే… తాడో పేడో తెల్చుకునేందుకు ఆమె కొత్త కార్యాలయం తెరిచినట్టుగా పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

మీసాల గీత పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కె.ఎ నాయుడుతో పాటు పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.ఇక గీత బాటలోనే మరో మాజీ మంత్రి పడాల అరుణ కూడా అసమ్మతి రాగం అందుకున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడితే కనీసం పలకరించే నాథుడే లేరని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అరుణ సైకిల్ దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

సంచయితకు తోడు… పార్టీ నేతల నుంచి అసమ్మతిరాగం మొదలుకావడంతో పరేషాన్ అవుతున్నారు పెద్దాయన. నాలుగు దశాబ్దాల పాటు జిల్లాలో ఒంటి చేత్తో పార్టీని నడిపించిన అశోక్ గజపతి రాజుకు ఎంత కష్టమొచ్చిందోనని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version