ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తయ్యారు. కృష్ణా జిల్లాలో కూడా కరోనా కేసులు తీవ్రత ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ కొత్తగా 25 కరోనా పాజిటివ్ కసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాగం కరోనా కట్టడికి నిబంధనలు కఠినతరం చేసే పనిలో పడింది.
అందులో భాగంగా విజయవాడలో రేపు(ఆదివారం) రోజున మాంసం, చేపల అమ్మకంపై నిషేధం విధించారు. దీంతో రేపు నగరంలో చికెన్, మటన్, చేపల విక్రయాలు నిలిచిపోనున్నాయి. అయితే రేపు ఆదివారం కావడంతో చాలా మంది నాన్ వెజ్ కోసం ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
కరోనా నివారణ చర్యలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కబేళా, చేపల మార్కెట్ మూసివేస్తున్న కమిషనర్ వెంకటేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హచ్చరించారు. ప్రజలు దీనికి సహకరించాలని కోరారు. గత ఆదివారం కూడా విజయవాడ నగరంలో మటన్, చికెన్, చేపల దుకాణాలు తెరవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకు ఏపీలో 1016 కరోనా కేసులు నమోదు కాగా, అందులో కృష్ణా జిల్లాలో 127 ఉన్నాయి.