టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వొడాఫోన్ రెడ్ మ్యాక్స్, వొడాఫోన్ రెడ్ టుగెదర్ ఎం పేరిట సదరు ప్లాన్లు కస్టమర్లకు లభిస్తున్నాయి. రెడ్ మ్యాక్స్ పోస్ట్ పెయిండ్ ప్లాన్‌లో రూ.699 మంత్లీ రెంటల్ చెల్లించాల్సి ఉంటుంది. రెడ్ టుగెదర్ ఎం పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో నెలకు రూ.899 రెంటల్ ఉంటుంది. రెడ్ టుగెదర్ ప్లాన్‌లో నలుగురు ఫ్యామిలీ మెంబర్లకు కనెక్షన్లు తీసుకోవచ్చు. బిల్ ఒకటే వస్తుంది. అందరికీ కలిపి నెలకు 160 జీబీ డేటాను ఉచితంగా ఇస్తారు. ప్రైమరీ నంబర్‌కు మాత్రం 70జీబీ వరకు డేటా ఇస్తారు. మిగిలిన 3 నంబర్లకు ఒక్కొక్క దానికి 30జీబీ డేటాను ఉచితంగా ఇస్తారు. దీంతో మొత్తం 160 జీబీ డేటాను నెల నెలా నలుగురు కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చు.
టుగెదర్ ఎం ప్లాన్‌లో నెలకు 200 జీబీ డేటా వరకు డేటా రోల్ ఓవర్ సదుపాయం ఉంటుంది. అంటే ఒక నెలలో వాడుకోని డేటా మరో నెలకు బదిలీ అవుతుందన్నమాట. అలా 200జీబీ వరకు లిమిట్ ఉంటుంది. సెకండరీ నంబర్లకు 50జీబీ డేటా వరకు ఈ సదుపాయం ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్ ఇస్తారు. నెలకు ఒక్కో యూజర్‌కు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. ఏడాది వ్యవధి గల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్ ప్లే మెంబర్‌షిప్‌ను ఏడాది పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
అలాగే రెడ్ మ్యాక్స్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోమింగ్ లభిస్తాయి. ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్, వొడాఫోన్ ప్లే మెంబర్‌షిప్‌లు ఉచితంగా లభిస్తాయి. ఇవి కేవలం డిజిటల్ ప్లాన్లు. అంటే వీటిని కేవలం వొడాఫోన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవడం ద్వారా మాత్రమే పొందవచ్చు.