2012, డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ మంగళవారం సుప్రీంకోర్టుకు తన వాదన వినిపించే క్రమంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడం ఏకపక్షమని, రాష్ట్రపతి భవన్‌కు తాను తిరిగి వెళ్ళే అవకాశం ఇవ్వకుండా తీసుకున్న నిర్ణయమని, ట్రయల్ కేసు తీర్పు కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేసాడు.
జస్టిస్ ఆర్ బానుమతి నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ముఖేష్ సింగ్ తరఫు న్యాయవాది అంజన ప్రకాష్, ఈ నెల ప్రారంభంలో రాష్ట్రపతి క్షమాపణ కోసం ముఖేష్ సింగ్ పెట్టుకున్న దరఖాస్తుని కొట్టేయడాన్ని సవాల్ చేసారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ అతను కొన్ని వింత వాదనలను చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
తాను అసలు తప్పు చేసినట్టు సాక్ష్యాలు లేవని అతను కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చాడు. రామ్ సింగ్ మరియు అక్షయ్ ఠాకూర్ అనే ఇద్దరు దోషుల డిఎన్ఎ మాత్రమే బాధితురాలి మీద ఉందని తన తప్పు లేదని చెప్పాడు. అయితే రికార్డుల్లో కూడా అదే విషయం ఉండటం గమనార్హం. కోర్టులు నాకు మరణశిక్ష విధించాయి .. నేను లైంగిక వేధింపులకు పాల్పడ్డానా?” అని ముఖేష్ సింగ్ చెప్పినట్టు తెలుస్తుంది.