ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టుదలగా ఉన్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఎలా అయినా సరే పరిపాలనను విశాఖ నుంచి చేసే విధంగా ఆయన వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉన్నా, న్యాయస్థానం అడ్డు చెప్పినా సరే ఎలా అయినా సరే రాజధాని తరలింపుని ఖాయం చెయ్యాలని, అక్కడి నుంచి పాలన మొదలు పెట్టాలని చూస్తున్నారట.
ఈ విషయంలో కేంద్రం అడ్డు చెప్పినా సరే వెనక్కు తగ్గోద్దనే భావనలో జగన్ ఉన్నారట. బిల్లు ఆమోదం పొందితే పొందింది, లేకపోతే విశాఖ వెళ్ళిపోవాలని ఇప్పటికే అధికారులకు కూడా స్పష్టంగా చెప్పారట ముఖ్యమంత్రి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంతో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చెయ్యాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ముఖ్యమంత్రి ఎక్కడ పరిపాలిస్తే అదే రాజధాని అని జగన్ చెప్పారు. ఇప్పుడు ఆయన అన్నట్టుగానే విశాఖలో ఉగాది రోజు నుంచి పరిపాలించే అవకాశాలు కనపడుతున్నాయి. మాజీ అటార్నీ జనరల్, ప్రస్తుతం రాజధాని కేసులను వాదించేందుకు ప్రభుత్వం నియమించుకున్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సలహాలను జగన్ తీసుకున్నారట. బిల్లు అవసరం లేదు జీవో చాలని ఆయన చెప్పారట.
అదే విధంగా ఉగాది సందర్భంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్కడి నుంచే ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు శాఖల అధిపతులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది. ఆర్ధిక, రెవెన్యు, పురపాలక, జలవనరుల శాఖలను విశాఖ నుంచే నిర్వహిస్తారని అంటున్నారు.