”కరోనా గురించి జనాలు ఇప్పుడు భయపడుతున్నారు కానీ.. డిసెంబర్ నెలలోనే నాకు భయపెట్టే కాల్స్ వచ్చాయి. కరోనా వస్తుందని, ఎప్పుడైనా సరే పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని నాకు కాల్ చేసేవారు. దాంతో నాకు విపరీతమైన భయం వేసింది. అప్పట్లో మాకు ప్రొటెక్షన్ పరికరాలు ఏవీ లేవు. మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లు లేవు. ఆ సమయంలో ఒక పేషెంట్ నా దగ్గరకు గొంతు సమస్య ఉందని వచ్చాడు. అతనికి పరీక్ష చేస్తున్నప్పుడు దగ్గాడు. నాకు భయం వేసింది. అమ్మా నాన్న నన్ను డాక్టర్ జాబ్ వదిలేయమని చెప్పారు. అయితే తరువాతి రోజే మాకు ప్రొటెక్షన్ పరికరాలు ఇచ్చారు. దీంతో అమ్మానాన్న కొంత శాంతించారు.
నాన్న నాతో రోజూ మాట్లాడతారు. రోజుకు 2 సార్లు కాల్ చేస్తారు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది అంటారు. కానీ నాకు మాత్రం కరోనా లక్షణాలున్న వారిని చూస్తే భయం వేసేది. బడ్స్‌ను వారి ముక్కు రంధ్రాల్లో పెట్టి శాంపిల్స్ తీయాలి. కరోనా పేషెంట్లను ఐసొలేషన్ వార్డుల్లో ఉంచి వారికి చికిత్స అందించాలి. అనుమానితులను గమనిస్తుండాలి. అయితే రాను రాను కరోనా అంటే నాకు భయం పోయింది. తరువాత కొద్ది రోజులకు నేను ఇంటికి వెళ్లా. నా గొంతులో ఎందుకో దురదగా ఉన్నట్లు అనిపించింది. తరువాత దగ్గు వచ్చింది. అయితే అది కేవలం అలర్జీ వల్ల వచ్చి ఉంటుందిలే అనుకున్నా.. కానీ తరువాతి రోజే నాకు జ్వరం మొదలైంది.
జ్వరం రావడంతో వెంటనే అలర్ట్ అయి టెస్టు చేయించుకున్నా. కరోనా రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ.. నాకు నచ్చిన కొన్ని సినిమాలు, షోలను చూశా. థాంక్ గాడ్.. నాకు కరోనా నెగెటివ్ అని వచ్చింది. తరువాత ఎప్పటిలాగే నేను మళ్లీ పని ప్రారంభించా. కొద్ది రోజులకు నాకు అమ్మ కాల్ చేసింది. కోవిడ్ 19 అనుమానిత వ్యక్తితో నాన్న కాంటాక్ట్ అయ్యారట. దీంతో నాకు తీవ్రమైన దుఃఖం వచ్చింది. అయితే ఆశ్చర్యంగా 10 రోజుల వరకు నాన్నలో ఎలాంటి కరోనా లక్షణాలు కనబడలేదు. అయితే నాన్న కాంటాక్ట్ అయిన కరోనా అనుమానితుడికి టెస్టు రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. దీంతో ఆ ఇద్దరినీ ఇప్పుడు హోం క్వారంటైన్‌లో ఉంచారు.
ప్రస్తుతం నేను అమ్మా నాన్నకు రోజూ వీడియో కాల్స్ చేస్తున్నా. బామ్మ అంటుంది.. నేను నిత్యం కరోనాపై పోరాడుతున్నానని.. అది నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది. వారు నిత్యం హాస్యమాడుకుంటూ.. నవ్వుకుంటుంటే.. నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నా. హాస్పిటల్‌లోనూ కరోనా పేషెంట్లు దిగులు చెందకుండా.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా.. ఓ సంతోషకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు కృషి చేస్తున్నాం. లాక్‌డౌన్ అనౌన్స్ చేశాక ఇప్పటికి ప్రజలకు కరోనా అంటే భయం పోయింది. ఇండ్ల నుంచి నెమ్మదిగా బయటకు వస్తున్నారు. అయితే అనుకోకుండా ఏవైనా సంఘటనలు జరిగితే.. ఇప్పటి వరకు మేం చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. మా కష్టం వృథా అవుతుంది. కనుక ఇండ్ల నుంచి బయటకు రావాలనే మీ ఆసక్తిని ఇంకొన్ని రోజుల పాటు అలాగే ఉంచుకోండి. మనం దగ్గరకొచ్చేశాం.. ముగింపు లైన్‌ను ఇంకా క్రాస్ చేయలేదు. అప్పటి వరకు జాగ్రత్తగా ఉందాం..!”