కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ డిస్టన్సింగ్ పాటించడం అనివార్యం అయింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న ముఖ్యమైన మార్గాల్లో సోషల్ డిస్టన్సింగ్ కూడా ఒకటిగా మారింది. అయితే దీన్ని మరింత కఠినంగా అమలు చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని దాదాపుగా అరికట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు వారు తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు.
జాన్స్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన పలువురు సైంటిస్టులు మేరీలాండ్‌కు చెందిన 1000 మంది కోవిడ్ పేషెంట్ల వివరాలను సేకరించారు. వారికి కరోనా ఎలా సోకి ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారికి తెలిసిందేమిటంటే… వారంలో నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు ప్రజా రవాణాను ఉపయోగించిన వారు కరోనా బారిన పడినట్టు గుర్తించారు. అలాగే ప్రార్థనా స్థలాలు, జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో గడిపిన వారు ఎక్కువగా కరోనా బారిన పడినట్లు గుర్తించారు.
అయితే ఆయా ప్రదేశాల్లో కఠినమైన సోషల్ డిస్టన్సింగ్ నిబంధనలను పాటిస్తే కరోనా వ్యాప్తిని దాదాపుగా అరికట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతోపాటు ఆయా ప్రదేశాల్లో శానిటైజేషన్ చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే ప్రజలు కచ్చితంగా మాస్కులను ధరించాలని, జనాలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలకు వెళ్లకూడదని, ప్రజా రవాణాను ఉపయోగించేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ చర్యలు చేపట్టడం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు.