రాష్ట్రంపై మిడతలు దండెత్తకుండా ముందుగానే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న మిడతల దండు ముందుగా తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మిడతలు రాష్ట్రంలోకి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అన్న అంశంపై అధికారులకు సూచనలు చేశారు.
వ్యవసాయ శాఖ అధికారులు, పలు రంగాలకు చెందిన సైంటిస్టులు, నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించిన కేసీఆర్.. మిడతలను నిరోధించడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు గాను ఫైరింజన్లు, జెట్టింగ్ మెషిన్లు, పెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. కాగా మిడతల దండు గమనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు.
మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చూసేందుకు గాను 5 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. శుక్రవారం నుంచి 4 రోజులపాటు రామగుండంలోనే ఆ కమిటీ ఉంటుందని తెలిపారు. మిడతలు రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే.. వాటిని సంహరించేలా ఆ కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం మిడతలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని అన్నారు. పంజాబ్ వైపు మిడతలు వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్పారని అన్నారు. ఒక వేళ మిడతలు గాలివాటంతో ప్రయాణిస్తే మనవైపుకు వస్తాయని, ఈ క్రమంలో హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తామని.. కేసీఆర్ తెలిపారు.