న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. జూన్ 1న రావాల్సిన నైరుతి రుతుపవనాలు జూన్ 3న కేరళ తీరాన్ని తాకాయి. దీంతో రుతుపవనాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ప్రభావంతో పలు నగరాల్లో భారీగా వర్షం కురిసింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్, గంగానగర్‌తో పాటు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోనూ మంగళవారం వర్షం కురిసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న మూడు రోజుల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురిస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. గత అనుభవాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నారు. మరో మూడు రోజులు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సమస్యలు తలెత్తితే జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూం నంబర్ 040-2111 1111కు ఫోన్ చేయాలని అధికారులు కోరారు.
అటు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు, చాలాచోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.