పశ్చిమబెంగాల్ లో గవర్నర్ జగదీప్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య వివాదం తార స్థాయికి చేరింది. ఈరోజు అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ కు చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీకి వచ్చిన ఆయన కాన్వాయ్ గేట్ నంబర్ వన్ గుండా లోపలకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ గేటుకు తాళం వేయడంతో ఆయన షాక్ కు గురయ్యారు. దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గవర్నర్ అసెంబ్లీ వెలుపల బైఠాయించడం సంచలనం కలిగించింది.
గవర్నర్ నిరసనకు దిగడంతో చివరకు అసెంబ్లీ సిబ్బంది వచ్చి గేటు తాళాలు తీశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారంటూ మమతా బెనర్జీ ఇటీవలి కాలంలో గవర్నర్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఘటనతో వీరి మధ్య అగాధం మరింత పెరిగినట్టయింది.