ఏపీలో మూడు రాజధానుల అంశం రకరకాలుగా రాజకీయ వాదోపవాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉన్న వైసీపీ నేతలకు మాత్రం ఇది శరాఘాతంగా మారింది. వాస్తవంగా చూస్తే జగన్ నిర్ణయం అటు ఉత్తరాంధ్రతో పాటు ఇటు రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి చాలా ప్లస్ అయ్యింది. ఈ రెండు టీడీపీ శరవేగంగా పతనం అవుతోంది. అయితే ఇదే నిర్ణయం రాజధాని జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. చంద్రబాబు సైతం అమరావతిని గట్టిగా సమర్థిస్తూ ఉండడంతో ఈ రెండు జిల్లాల్లో మాత్రం టీడీపీ సరికొత్త ఊపరిలూదినట్లయ్యింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ టీడీపీ ఎంతో కొంత పుంజుకుందన్నది మాత్రం వాస్తవం. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రెండు జిల్లాల వైసీపీ ప్రజాప్రతినిధులు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు 29 దాకా గెలిచిన వారు ఉన్నారు. వారంతా కూడా తాజా పరిణామాలపైన మదనపడుతున్నారు. అయితే వీరంతా జగన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాజధాని మార్పు ప్రభావంతో తాము జనాల్లోకి వెళ్లలేకపోతున్నామని…. ఇలా అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పడంతో పాటు.. తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారట.
అయితే జగన్ మాత్రం వారిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారట. ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉందని.. ఈ లోగా రెండు జిల్లాల్లో కావాల్సినంత అభివృద్ధి జరుగుతుందని… అదే సమయంలో అమరావతి అభివృద్ధికి, ఇక్కడ రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా జగన్ వారికి చెప్పారట. రెండు జిల్లాల్లో తిరుగులేని అభివృద్ధి చేసి చూపించి… ఇక్కడ ప్రజలను ఎలా వైసీపీ వైపునకు తిప్పుకోవాలో తనకు తెలుసని కూడా జగన్ చెప్పడంతో పాటు… తన కార్యాచరణ కూడా వెల్లడించారట. ఏదేమైనా జగన్ ధైర్యం మరి ఇక్కడ వైసీపీలో ఎలాంటి సరికొత్త ఉత్సాహం ఇస్తుందో ? చూడాలి.