మనకు ఏదైనా శుభకార్యం చేస్తుంటే ముహూర్తం పెట్టుకోని చేయడం బాగా అలవాటు. మంచి ముహూర్తం చేసుకుని మొదలపెడతాం. అయితే ఇదంతా సంప్రదాయం, నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటి ప్రభావాలు ఉంటాయా ఏంటి అని కొందరు అంటుంటారు. సైన్స్ వీటిని నమ్మదంటారు. మరీ చంద్రయాన్ 3 పంపడానికి ముహూర్తం పెట్టారు. అది ఎందుకు..? అసలు సరిగ్గా అదే టైమ్‌ను ఎలా నిర్ణయించారు.. ఈ విషయాలు తెలుసుకుందామా..!
చంద్రయాన్-3 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసుకున్న ఇస్రో జూలై 14 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరపడం జరిగింది. అయితే చంద్రుడు మీదకు వెళ్లడానికి ముహూర్తం ఎందుకా అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే భూమి మీద చేసే ప్రయాణానికి అంతరిక్షంలో చేసే ప్రయాణానికి ఎంతో తేడా ఉంది. ఇక్కడ నిర్ణయించబడే ముహూర్తం అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకొని వేసే ప్రణాళిక కాబట్టి.
మనం ఒక ప్రాంతం నుంచి రెండవ ప్రాంతానికి భూమి మీద వెళ్ళాలి అంటే మనం ప్రయాణానికి తీసుకునే సమయం అనేది వాహనం వెళ్లే వేగాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక స్థిరమైన ప్రాంతం నుంచి మరొక స్థిరమైన ప్రాంతానికి వెళ్తాము కాబట్టి ప్రయాణం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ అంతరిక్షంలో జరిగే ప్రయాణం అలా ఉండదు. అంతరిక్షంలో జరిగే ప్రయాణం అంటే భూమి యొక్క గ్రావిటీ అధిగమించి మరీ పైకి వెళ్లాల్సి ఉంటుంది.
అందుకే అంతరిక్షంలోకి శాటిలైట్లను ప్రవేశపెట్టడం కోసం లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆకాశంలోకి నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి వలయాకార మార్గంను ఎంచుకుంటారు. అయితే నిర్ణయించిన ముహూర్తానికి ఒక్క క్షణం ఆలస్యమైన మరొక నెల ఆగాల్సి ఉంటుందట. ఎందుకంటే చంద్రుడి మీదకు లాండర్ పంపించడం అంటే మనకు నచ్చిన రోజు పంపనీకి ఉండదు.
చంద్రుడు యొక్క దశలను బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. చంద్రుడు మీద దిగిన తర్వాత అవసరమైన పరిశోధనలు చేయడానికి లాండర్, రోవర్ మోడ్యులకు అక్కడ విద్యుత్ అవసరం ఉంటుంది. అవి సౌర శక్తి ద్వారానే విద్యుత్ పొందుతాయి కాబట్టి సూర్యరస్మి ఉండాలి అంటే చంద్రుడు మీద పగలు ప్రారంభమయ్యే సమయానికి ల్యాండింగ్ జరగాలి. అందుకే ఆ టైమ్‌ను పరిగణిలోకి తీసుకుని ముహూర్తం డిసైడ్ చేశారనమాట.