గర్భిణీగా ఉన్నప్పుడు బిడ్డపుడుతుందన్న సంతోషం ఎంత ఉంటుందో..అంతే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి. అన్నింటిని అధికగమించి తల్లి బిడ్డ ఆరోగ్యం చక్కగా ఉండేలా కాపాడుకోవాలి. ముఖ్యంగా రెండు, మూడు నెల్లలో గర్భిణీలకు వాంతులు ఎక్కువగా అవుతాటి. వికారంగా ఉండటంతో ఏదీ తినాలనిపించదు. అలా అని తినకుండా ఉంటే మీ ఆరోగ్యంతో పాటు లోపల బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలాంటప్పుడు వాంతులు, వికారం రాకుండా ఉండాలంటే ఏం తినాలి..?
మొదటి మూడు నెలల్లో ఆహార పరిమాణంపై కాకుండా పోషకాలపై దృష్టి పెడితే చాలు. వాంతులవుతున్నాయని తిండి మానేయకుండా… నిదానంగా జీర్ణమయ్యేవి తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండి వాంతులు అవుతాయి.. కాబట్టి తేలిగ్గా అరిగేవి తీసుకోవాలి. చల్లని పెరుగన్నం, చల్లటి పాలు, సగ్గుబియ్యం పాయసం వంటివి తీసుకుంటే వాంతుల వల్ల వచ్చే గొంతు మంట తగ్గుతుంది.
దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్… పండ్ల రసాలను ఐస్ క్యూబ్ల వేసుకునీ తీసుకోవచ్చు.
వేయించిన సోంపు, ఎండు ఉసిరి ముక్కలు బుగ్గన పెట్టుకున్నా బాగుంటుంది.
కార్న్‌ఫ్లేక్స్, సీరియల్ బార్స్, ఖర్జూరాలు, బ్రెడ్ జామ్, అటుకులు, ఇడ్లీ, సగ్గుబియ్యం కిచిడి, సేమ్యా ఉప్మా, అటుకుల ఉప్మా, కట్లెట్, ఆలూ శాండ్‌విచ్, ఉడకబెట్టిన చిలగడదుంప తినొచ్చు.
నూనె, మసాలాలకి ఈ సమయంలో దూరంగా ఉండాలి.
మిల్క్‌షేక్స్, తాజాపండ్ల రసాలు, బ్రెడ్, పీనట్ బటర్‌తో శాండ్‌విచెస్‌లనూ తీసుకోవచ్చు.
అన్ని రకాల పదార్థాలనూ ఒకేసారి తినకుండా.. టైమ్ గ్యాప్ ఇస్తూ తీసుకోవాలి. ఒకసారి పప్పన్నం, మరోసారి పెరుగన్నం.. ఇలా.
పాలు, పెరుగు, ఆకుకూరలు, తాజా పండ్లు ముఖ్యంగా పసుపు రంగులో ఉన్నవి, తాజా కూరగాయలు, గుడ్లు, పనీర్, ఎండుఫలాలనూ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
తినగానే వెంటనే పడుకోవద్దు. రోజూ కాసేపు తప్పక నడవాలి.
సాధ్యమైనంత వరకు నిటారుగా కూర్చోవడానికే ప్రయత్నించాలి.
ఇవన్నీ చేస్తే మందులు అవసరం లేకుండానే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. మీ ఆరోగ్యంతో పాటు లోపల బిడ్డ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. తినాలని లేకున్నా. ఇష్టలేకపోయినా అన్నీ తినేందుకు ప్రయత్నించండి.!