ఇద్దరి ప్రాణాలు బలిగొన్న స్విమ్మింగ్ సరదా.. ఎక్కడంటే?

-

సరదాగా స్విమ్మింగ్ చేసేందుకు వెళ్లిన ఇద్దరు ఫ్రెండ్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దేశ్ముఖి గ్రామశివారులో గల సాయి వికాస్ స్టోన్ క్రషర్ క్వారీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని మియాపూర్ కు చెందిన గందే జతిన్, కూకట్ పల్లి వాసి బొద్దు శ్యామ్ చరణ్, కర్మాన్ ఘాట్‌కు చెందిన చెల్ల అక్షయ్ కుమార్, అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన వర్జాల శ్రీమన్‌లు దేశ్ ముఖి గ్రామంలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు.

ఈ క్రమంలోనే నలుగురు ఫ్రెండ్స్ కాలేజీలో పరీక్షలు రాసి ఈత కొట్టేందుకు సమీపంలోని క్వారీ వద్దకు వెళ్లారు.శ్యామ్ చరణ్, జతిన్ లు ఇద్దరూ క్వారీ గుంత 20 ఫీట్ల లోతు ఉందని తెలియక ఈత కొట్టడానికి క్వారీలోకి దిగారు. దీంతో వారికి ఈతరాక నీటిలో మునిగిపోయారు. మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ గట్టిగా అరిచి సాయం చేయాలని కోరినా ఫలితం లేదు. కళ్ళముందే ఇద్దరు స్నేహితులు నీటమునిగి ప్రాణాలను కోల్పోయారు. దీంతో వారు వెంటనే స్థానిక పీఎస్‌కు సమాచారం ఇవ్వగా చౌటుప్పల్ ఏసీపీ మధుసుదన్ రెడ్డి, చౌటుప్పల్ సీఐ రాములు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version