అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ కమలా హారిస్.అగ్రరాజ్య చరిత్రలో ఇంతవరకూ మహిళలు అధ్యక్షులుగా లేదా ఉపాధ్యక్షులుగా పనిచేసిన దాఖలాలు లేవు. 1984లో డెమొక్రాట్ జెరాల్డిన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ సారా పాలిన్ బరిలో నిలిచినా.. పార్టీల ఓటమి కారణంగా వారు ఆ పదవి చేపట్టలేకపోయారు. ఇప్పుడు ఎన్నికల్లో డెమొక్రట్లు గెలవడంతో… ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.
కమలా హారిస్ తల్లి భారతీయురాలు. తండ్రి జమైకా దేశస్థుడు. తమిళనాడుకు చెందిన కమల తల్లి శ్యామలా గోపాలన్.. 1960లో అమెరికా వలస వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. ఆమె న్యూట్రిషన్.., ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్ జన్మించారు. కమల.. తాతగారు పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. చిన్నతనంలో తరచూ చెన్నై రావడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది. తల్లి తరఫున బంధువులను కలిసేందుకు పలుమార్లు కమలా హారిస్.. భారత్‌కు వచ్చారు. అటు జమైకా, ఇటు భారత్ సంస్కృతుల కలబోతగా నిలిచారామె.
డెమొక్రాట్ల ప్రచారంలో కమలా హారిస్ కీలకపాత్ర పోషించారు. ఫర్ ద పీపుల్ అంటూ కమలా హారిస్ ఇచ్చిన నినాదం.. చాలా పాపులర్ అయింది. మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రచారాస్త్రాలుగా చేసుకున్నారు. మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం’ అంటూ కమల విడుదల చేసిన క్యాంపెయిన్ వీడియోకు అనూహ్య స్పందన వచ్చింది. చక్కని వాగ్ధాటి, సమస్యలపై పూర్తి అవగాహన, అటార్నీ జనరల్ గా, సెనేటర్ గా పనిచేసిన అనుభవం.. కమలా హారిస్ ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
ఉపాధ్యక్ష అభ్యర్థి కోసం జో బైడెన్ వెతికి వెతికి… చివరకు కమలా హారిస్ పర్ఫెక్ట్ అని భావించారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి షాకిచ్చే రేంజ్‌లో కమలా హారిస్ స్పీచ్‌లు ఇవ్వగలరనీ, ప్రజలను ఆకట్టుకోగలరని జో లెక్కలేశారు. కమలా హారిస్‌కి… అమెరికాలోని అత్యుత్తమ నేతల్లో ఒకరిగా పేరుంది. డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్‌గా ప్రశంసలు అందుకున్నారు. టెక్నాలజీపై పట్టు.. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన అనుభవం కారణంగా… స్పీచ్‌లు ఇవ్వడంలో దిట్ట అయిన కమలా హారిస్‌నే ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకున్నారు.
పౌరహక్కుల ఉద్యమంలో యాక్టివ్‌గా ఉండే కమలా హారిస్.. నల్లజాతీయుల పోరాటానికి బాసటగా నిలిచారు. ఆ వర్గం ఓట్లతో పాటు… భారతీయుల ఓట్లు కూడా డెమోక్రాట్లకే గుంపగుత్తగా పడినట్లు అంచనాలున్నాయి. కమల గెలవడం వల్ల భారత్‌కు ప్రయోజనమేనా? ఇక తల్లిని తన రోల్‌మోడల్‌గా భావించే కమల.. పలు సందర్భాల్లో తన భారత మూలల గురించి గర్వంగా చెప్పుకొన్నారు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా తల్లి తమను పెంచారన్నారు. అందుకే అటు భారతీయ మూలాలు ఉన్న నాయకురాలు అనే సెంటిమెంట్, ఇటు ఇమ్మిగ్రేషన్ విధానాల్ని మారుస్తారనే ఆశతో భారతీయ ఓటర్లంతా కమలా హారిస్ కారణంగా.. డెమోక్రాట్ల వైపు మొగ్గుచూపారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2017లో కమల కాలిఫోర్నియా నుంచే సెనెటర్ అయ్యారు. అప్పుడు కూడా ట్రంప్ తెచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని తీవ్రంగా విమర్శించి వార్తల్లోకెక్కారు.
డిస్ట్రిక్ట్ అటార్నీ నుంచి సెనెటర్ వరకు కమలా కెరీర్ లో ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. అధ్యక్ష ఎన్నికల రేసులో మాత్రం ఆమె ప్రైమరీ దశలోనే వెనకడుగువేయాల్సి వచ్చింది. డెమొక్రట్ల తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులో మొదట కమల హారిస్ కూడా వుంది. అయితే, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆమె తొలి దశలోనే తప్పుకోవాల్సి వచ్చింది.