అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు నిధులను నిలిపివేసినప్పటి నుంచి ఆ సంస్థకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనా WHOకు నిధులను ఎక్కువగా అందజేస్తామని ప్రకటించినప్పటికీ అవి ఏమాత్రం సరిపోయేలా లేవు. ఎందుకంటే.. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున తయారు చేయాలంటే.. చాలా పెద్ద మొత్తంలో నిధులు అవసరం అవుతాయని.. కానీ అన్ని నిధులు ప్రస్తుతం తమ వద్ద లేవని WHO ఇప్పటికే తెలిపింది. దీంతో ఆ సంస్థ కరోనా వ్యాక్సిన్లను ఎలా తయారు చేయాలా.. అని ఆలోచిస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు పోటీ పడుతున్నారు. కొందరు జంతువులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి కూడా. దీంతో త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించి వ్యాక్సిన్‌ను తయారు చేయాలని చూస్తున్నారు. అయితే మరోవైపు WHO కూడా కరోనా వైరస్‌కు వ్యాక్సిన్లను తయారు చేస్తోంది. ఈ క్రమంలో 8 కరోనా వ్యాక్సిన్లను తయారు చేస్తున్నామని WHO తెలిపింది కూడా. అయితే అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మరో 12 నుంచి 18 నెలల సమయం పడుతుందట. కానీ వాటిని పెద్ద ఎత్తున తయారు చేసేందుకు ప్రస్తుతం ఆ సంస్థ వద్ద నిధులు లేవు.
ప్రపంచంలోని 40 దేశాలు, పలు సంస్థలు, బ్యాంకులు కలిసి ఇటీవల WHOకు రూ.60వేల కోట్ల వరకు నిధులను అందజేశాయి. అయితే ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్లకు ఆ నిధులు సరిపోయినా.. రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను తయారు చేస్తే.. మరిన్ని నిధులు కావల్సి వస్తాయని WHO అంటోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు నిధులను సమకూర్చుకునే పనిలో పడింది. అయితే ప్రపంచ దేశాల కన్నా WHO వ్యాక్సిన్‌ను ముందుగా తయారు చేస్తుందా, లేదా.. అనేది.. వేచి చూస్తే తెలుస్తుంది..!