రాజకీయాల్లో ఒక్కోసారి ఏదో అనుకుంటే ఏదేదో జరుగుతుంది. ఎవరి తలరాతలు ఎప్పుడు తల్లకిందులు అవుతాయో ? ఎవరి జాతకం ఎప్పుడు తిరగబడుతుందో ? ఎవ్వరూ ఊహించలేరు. ఏపీ తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ సైతం ఇప్పుడు రాజకీయంగా ఏం చేయాలో తెలియక సంకట స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది. దివంగత మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వారసుడిగా కాంగ్రెస్ తరపున 2014 ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిన అవినాష్ ఆ తర్వాత తండ్రితో కలిసి టీడీపీలోకి జంప్ చేశాడు.
ఇక తండ్రి ఆకస్మిక మృతి తర్వాత బాబు ఊరించి ఊరించి ఎన్నికలకు ముందు ఏపీ తెలుగు యువత పగ్గాలు అప్పగించారు. ఇక ఎన్నికలకు ముందు గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేసేందుకు ఎవ్వరూ సరైన క్యాండెట్ లేకపోవడంతో బాబు చివర్లో అవినాష్‌ను రంగంలోకి దింపారు. ఓ విధంగా చెప్పాలంటే అవినాష్‌ను బలి పశువును చేశారనే అనుకోవాలి. అక్కడ దాదాపు రు.80 కోట్లు ఖర్చు పెట్టినా నానీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు.
ఇక ఎన్నికలకు ముందు అవినాష్ తనకు విజయవాడ తూర్పు లేదా పెనమలూరు కావాలని పట్టుబట్టినా అటు బాబు, ఇటు బాబాయ్ ఉమా అవినాష్‌ను గుడివాడకు పంపి బలి పశువును చేశారు. ఇక ఇప్పుడు అవినాష్ గుడివాడలో ఉండేందుకు… అక్కడ రాజకీయం చేసేందుకు కూడా ఇష్టపడడం లేదు. ప్రస్తుతం పెనమలూరు గాని విజయవాడ తూర్పు సీటు గాని కావాలని పట్టుబడుతున్నాడట. వంశీ పార్టీ వీడి గద్దె కుటుంబాన్ని గన్నవరం పంపిస్తే తాను విజయవాడ తూర్పులో ఉండొచ్చన్నదే అవినాష్ ప్లాన్.
అయితే ఎన్నికలై ఆరు నెలలు గడిచినా ఇంకా అటు బాబు నుంచి అవినాష్‌కు ఎలాంటి స్పష్టతా రావడం లేదట. చివరకు అవినాష్ వైసీపీలోకి వెళతారన్న వార్తలు కూడా వచ్చాయి. గన్నవరంకు ఉప ఎన్నికలు వస్తే అక్కడ కూడా అవినాష్‌ను పోటీ చేయించాలన్న ఆలోచన కూడా బాబుకు ఉంది. ఈ విషయం ఇటీవలే లోకేష్ అవినాష్ దగ్గర ప్రస్తావించగా… ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను గన్నవరంలో పోటీ చేస్తే గుడివాడ, గన్నవరం, విజయవాడ తూర్పు ప్రజలు ఎవ్వరూ నమ్మరని ఖరాఖండీగా చెప్పేశారట.
పెనమలూరు లేదా విజయవాడ తూర్పు మినహా తనకు ఎక్కడా వద్దని… లేనిపక్షంలో తాను అసలు ఎన్నికల్లోనే పోటీ చేయనని ఇటీవల యువనేతల సమావేశంలో లోకేష్‌తో చెప్పడంతో లోకేష్ సైతం అవినాష్‌ను సముదాయించే ప్రయత్నం చేసినట్టు టాక్…?