శివరాత్రి అంటేనే జాగరణ. అత్యంత పవిత్రమైన రోజు. పురాణాలలో జాగరణ గురించి అనేక విశేషాలను తెలియజేసింది.‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ.. మనస్సు, ఇంద్రియాలకు అందనివి.. అది అనుభవంతోనే తెలుస్తుంది. అని ఈ విషయాన్ని తైత్తిరీయ ఉపనిషత్ ఓ కథలో వివరించింది. శివరాత్రి రోజు నిద్ర పోకుండా అని జాగరణ చేయాలి అని, ఉపవాసం చేయాలని పురాణాలలో ఉంది. ఇక్కడ నిద్ర అంటే ఏమిటి? అందరి స్వరూపమైన ఆత్మ పరమార్థాన్ని తెలియకపోవడమే అంటే అవిద్యయే నిద్ర. ‘అన్యథా గృహ్లాతః స్వప్నః’ అన్నారు గౌడపాదులు. అంటే ఆత్మ తత్వాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోకుండా దానిని దేహం, మనస్సు, ఇంద్రియాలని తప్పుగా తెలుసుకోవడమే స్వప్నం.
మాయనిద్ర నుంచి బయటకు రావాలంటే !
ఈ రెండు నిర్వచనాల వల్ల యధార్థ గ్రహణమే జాగ్రత్త (మెలకువ). అంటే తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణం. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి. ‘అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రభుద్యతే.. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా.. అంటే పరమ కరుణామూర్తి అయిన గురువులు ఆత్మోపదేశం చేయగా అనాది మాయానిద్ర తొలగి, అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం అయిన తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగరణ అని శాస్త్రాలు పేర్కొన్నాయి.
పరమాత్మకు సామీప్యం కోసం !
అత్మ.. జీవాత్మ వీటిని పరమాత్మతో అనుసంధానం చేయడం కోసం ఉపవాసం, జాగరణ చేయాలి. పూర్తిగా మనస్సు, ఆత్మలను భగవదారాధనతో ధ్యానంతో సమాధి స్థితికి చేరే ప్రయత్నం చేయాలి. విషయ భోగాలు, లౌల్యాలకు అతీతంగా ఉండటానికి కనీసం ఏడాదిలో ఒక్కరోజైనా ప్రయత్నిస్తే కొంతకాలానికి ఆ శుద్ధచైతన్య స్థితివైపు మనసు పోతుందని పూర్వీకులు ఇలాంటి పవిత్రమైన ఆచారాలను ఏర్పాటు చేశారు. కానీ నేడు దానికి విరుద్ధంగా శివరాత్రి కాబట్టి జాగరణ చేయాలని సినిమాలు చూడటం, ఇతర పనులు చేయడం సరికాదు. శివరాత్రి నాడు రోజు ఆహారం తీసుకోరాదని రకరకాల తీర్థాలను జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేశామని భావించకూడదు. ఉప అంటే దగ్గర.. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం. గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం. అంతేగాని శరీరం ఎండబెట్టడం ఉపవాసం కాదు. అయితే శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే అది ఆరోగ్యానికి, అంతఃకరణశుద్ధికి ఉపయోగం కాని ఇదే పరమార్థం అనుకోకూడదు. అయితే దీనిలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముసలివారు, ఆనారోగ్యంతో బాధపడుతున్నవారు,పిల్లలు, గర్భిణులు, ఉద్యోగం, శ్రామికు, కర్షకులు ఉపవాసం చేయకున్నా దోషం కాదు అని పండితులు పేర్కొంటున్నారు.
– కేశవ