గ్రేటర్ లో ప్రచారానికి లోకేష్,బాలయ్య చొరవ తీసుకుంటారా ?

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేస్తామన్న టీడీపీ వ్యూహం పై తెలుగు తమ్ముళ్ల మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటే ప్రచారానికి వచ్చేది ఎవరు… తెలంగాణలో పార్టీని బతికించుకోవడం కోసం చంద్రబాబు, లోకేష్‌, బాలయ్య చొరవ తీసుకుంటారా గ్రేటర్‌ ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న ఉత్కంఠ తెలుగు తమ్ముళ్లలో ఉందట.

టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రచారానికి వచ్చే వాళ్లలో పార్టీ అధినేత చంద్రబాబు ఉంటారు. తర్వాతి స్థానంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వస్తారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నగారా మోగడంతో వీరిద్దరూ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా తక్కువ సమయంలో ఎన్ని ప్రాంతాలు కవర్‌ చేస్తారు? అన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. ఇటీవల పార్టీ కమిటీలలో చోటు దక్కించుకుని.. టీడీపీ కార్యకలాపాలలో చురుకుగా ఉంటున్న బాలకృష్ణ సైతం ప్రచారంలో పాల్గొంటారా అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జోరందుకుంది.

గతంలో గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిపి పోటీ చేశాయి. అప్పుడు చంద్రబాబే టీడీపీ ప్రచార బాధ్యతలను నెత్తిన పెట్టుకుని సిటీలో సుడిగాలి పర్యటన చేశారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు కారెక్కేశారు. ఇంకొకరు పార్టీలో ఉన్నారు అంటే ఉన్నారు అనుకోవాలి. ఇటీవలే తెలంగాణ టీడీపీ రాష్ట్రకమిటీని ప్రకటించారు. నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ కుమార్తె సుహసిని కమిటీలోకి తీసుకుని ఉపాధ్యక్షురాలిని చేశారు. ఆమెతోపాటు రాష్ట్ర కమిటీ మొత్తం జీహెచ్ఎంసీ పై ఫోకస్‌ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కనీసం పరువు కాపాడుకుంటే రాష్ట్రంలో పార్టీకి ఊపిరి పోసినట్టు అవుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారట. సమయం సందర్భం ఏదైనా బాలయ్య బరిలోకి వస్తే ఆ మజానే వేరన్నట్లుగా ఉంటుంది.. ఇక ఎన్నికల ప్రచారం ఆయనకు ఆయనే సాటి, తొడగొట్టాడంటే ఓట్లు పడ్డా పడకున్నా జనం మాత్రం కేక పెట్టాల్సిందే. అందుకే చంద్రబాబు, లోకేష్‌తోపాటు బాలకృష్ణ కూడా ప్రచారానికి వస్తారని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

పార్టీ తరపున ప్రచారానికి బాలయ్య వస్తే కచ్చింతగా , గ్రేటర్ లో జోష్ పెరగనుంది.. ఓట్ల సంగతి పక్కన పెడితే ఎన్నికల్లో హంగామా ఉండనుంది.. అయితే మామ అల్లుల్లు ప్రచారం చేస్తారా.. పెద్దాయనకే వదిలేస్తారా.. లేక లోకల్ లీడర్స్ కు వదిలి చేతులు దులుపుకుంటారా అనేదా తేలాల్సి ఉంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version