సొంత గ్రామంలో ఆ మంత్రి ఈ సారైనా పరువు నిలుపుకుంటారా

-

నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రెండవసారి మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సొంత గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నిక మాత్రం ఆయనకు గట్టి సవాలే విసురుతున్నాయి. జిల్లా రాజకీయాలను శాసిస్తున్న ఆయనకు..ఆ ఒక్క పంచాయతీ మాత్రం ఛాలెంజ్‌గా మారింది. దీంతో స్వగ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకున్నారు.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక నేత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. 1999లో కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిసారి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి వరుసగా మూడు సార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రిగా పనిచేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించారు. 2014లో ఒంగోలులో ఓడిన బాలినేని.. 2019లో మరోసారి గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి.. ఇప్పుడు సొంతగ్రామంలో జరుగుతున్న ఎన్నికలు సవాల్‌గా మారాయి.

పంచాయతీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ. వీలైనన్ని పంచాయతీల్లో అధికార పార్టీ సానుభూతిపరులు గెలిచేలా వ్యూహాలు రచిస్తోంది అధికారపార్టీ. ఎక్కడికక్కడ మంత్రులకు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పంచాయతీ ఎన్నికల విషయం పక్కన పెడితే సొంత గ్రామంలో జరుగుతున్న ఎన్నికలు బాలినేనికి ప్రతిష్టాత్మకంగా మారాయట. బాలినేని స్వగ్రామంలో జరుగుతున్న ఎన్నికలపై ఆయన ఎందుకు ఇంతలా ఆందోళన చెందుతున్నారో అని చర్చ జరుగుతోందట.

టంగుటూరు మండలం కొణిజేడు మంత్రి బాలినేని స్వగ్రామం. అయితే మంత్రి కుటుంబం.. గత కొన్నేళ్లుగా ఒంగోలులో స్థిరపడింది. 2013లో జరిగిన కొణిజేడు పంచాయతీ ఎన్నికల్లో బాలినేని నిలబెట్టిన వైసీపీ మద్దతు దారులు ఓడిపోయారు. సొంత గ్రామంలో వైసీపీ మద్దతు దారులు ఓటమిపాలు కావడంతో.. బాలినేని అప్పట్లో మనస్తాపం చెందారు. అందుకే ఈసారి ఎన్నికల్ని సవాల్‌గా తీసుకున్నారు. ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించకపోతే గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడనని శపథం చేశారట బాలినేని.

ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్న మంత్రి.. పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ బాలినేని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమస్య ప్రత్యర్థులతో అనుకుంటే అనూహ్యంగా సొంతపార్టీలోనే ఎదురైంది. వైసీపీ నుండే రెండు వర్గాలు పోటీపడి నామినేషన్లు వేశాయి. దీంతో అప్రమత్తమైన బాలినేని..కిందా మీదా పడి ఓ వర్గాన్ని బుజ్జగించి నామినేషన్లు విత్ డ్రా చేయించారు. ప్రస్తుతం కొణిజేడులో వైసీపీ, టీడీపీ మద్దతు దారులు పంచాయతీ పోరులో నిలబడ్డారు.

ఈ సారైన మంత్రికి అనుకూలంగా ఫలితం వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version