కలలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఒక్కోసారి అవి మన నిజజీవితంలో జరుగుతున్నాయా అన్న విధంగా అనిపిస్తాయి. ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన జెన్నా ఎవాన్స్ కూడా అలాంటి కలా వచ్చింది. అయితే ఆమె ఆ కల నిజజీవితంలో జరుగుతుందనుకుని తన చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని తీసి లటుక్కున మింగేసింది. మరి ఆ కల ఏంటి? ఆమె ఎలా ఉంగరాన్ని మింగేసిందో తెలుసుకుందాం..
ఆమెకు నిద్రలో తాను తన భర్తతో కలిసి హైస్పీడ్ రైలులో ప్రయాణిస్తున్నట్లు కల వచ్చింది. అందులో కొంతమంది దుండగులు వాళ్లను చుట్టుముట్టారని, దీంతో తన భర్త వెంటనే చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని తీసేసి మింగేయమని చెప్పాడట. దీంతో ఆమె కలలో కాకుండా నిద్రలో రియల్‌గా ఉంగరాన్ని మింగేసింది. నిద్ర లేచి చూసే సరికి చేతికి రింగు కనిపించలేదు. దీంతో ఉంగారన్ని మింగినట్లు వచ్చిన కలను నిజం చేసినట్లు తెలుసుకుంది.
వెంటనే ఆమె భర్త బాబ్ హావెల్‌ను లేపి విషయం మొత్తం చెప్పడంలో తన భర్త పగలబడి నవ్వాడని జెన్నా ఫేస్ బుక్‌లో తెలిపింది. ఆ తర్వాత ఈ విషయం తెలిసి తన అత్త కూడా నవ్విందని.. ఇలా చాలా సేపు దీన్ని తలచుకుని నవ్వుకున్నామని జెన్నా ఫేస్ బుక్ ద్వారా తెలియచేసింది. ఆ తర్వాత ఆమెను క్లినిక్ తీసుకువెళ్తారు. జెన్నాకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఉంగరాన్ని ఆమె పేగుల్లో ఉన్నట్లు గుర్తించారు.
బహుశా ఆమె ఉంగరాన్ని మింగేసిందనే విషయాన్ని గుర్తించి ఉండకపోతే అది విసర్జనతో బయటకు పోయేదని వైద్యులు తెలిపారు. ఇక చివరకు 2.4 క్యారెట్ల డైమండ్ రింగ్ తొలగించడానికి గాస్ట్రో ఎంటరోలాజిస్ట్ సాయంతో ఎండోస్కోపీ విధానం ఉపయోగించారు. ఫైనల్‌గా ఉంగారన్ని బయటకు తీశారని ఆమె పేర్కొంది.