దేశ రాజధాని ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. గత ఆదివారం వర్సిటిలో దాడి జరిగిన తర్వాత భారీగా పోలీసులు మోహరించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం దాడిని ఖండిస్తూ జెఎన్‌యుఎస్‌యూ నిరసనకు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నిరసన కారుల్లో ఒక మహిళ, డీసీపీ చేయి కొరికింది.
జెఎన్‌యుఎస్‌యు నిరసనకారులు శాస్త్రి భవన్ వైపు వెళ్తుండగా అదనపు డిసిపి ఇంగిత్ ప్రతాప్ సింగ్ చేతిని కొరికింది. ఆ మహిళ ఎవరు అనేది ఇంకా గుర్తించలేదు అధికారులు. పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగిన సమయంలో ఈ ఘటన జరిగిందని సమాచారం. గొడవలో డీసీపీ వద్దకు వచ్చిన మహిళ అతని ఎడమ బొటనవేలుపై కొరికింది. ఆమె నుంచి విడిపించుకోవడానికి డీసీపీ కష్టపడాల్సి వచ్చిందని సమాచారం.
ఆ తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో హింసను నిరసిస్తూ గురువారం రాష్ట్రపతి భవన౦ వద్దకు పాదయాత్రగా వెళ్ళడానికి ప్రయత్నించిన జెఎన్‌యు విద్యార్థులను పోలీసులు ఆపి, తరువాత అదుపులోకి తీసుకున్నారు. ఒకానొక సమయంలో పోలీసులు లాటి చార్జ్ కూడా చెయ్యాల్సి వచ్చింది. జెఎన్‌యులో ఇటీవల జరిగిన హింసను నిరసిస్తూ, వర్సిటీ వైస్-ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ప్రదర్శనకారులు గురువారం వీధుల్లోకి వచ్చారు.