విశాఖ జిల్లా గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు కలకలం రేపాయి. విశాఖ జిల్లా గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తుండగా… ప్రజాగళం వాహనం వెనుక నుంచి ఓ ఆగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ‘నిన్న సీఎంపైన చీకట్లో గులకరాయి పడింది. ఇప్పుడు నాపై కరెంట్ ఉన్నప్పుడే రాయి పడింది. తెనాలి సభలో పవన్ పైనా దుండగులు పవన్ పై రాళ్లు వేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ రాళ్లు వేస్తోంది. పోలీసులు ఏం చేస్తున్నారు?’ అని చంద్రబాబు మండిపడ్డారు.
ఇదిలా ఉంటే… చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని వైసీపీ ఎక్స్(ట్విట్టర్)లో ఖండించింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఎన్నికల కమిషన్ను కోరింది. కాగా నిన్న ఆగంతకుల రాయి దాడిలో సీఎం జగన్కు గాయమైన విషయం తెలిసిందే.