స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆయన అరెస్ట్ అక్రమం అని..రాజకీయ కుట్రలో భాగంగానే కేసులు నమోదు చేసి జైల్లో పెట్టించారని ఇప్పటికే తెలంగాణకు చెందిన కొందరు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈవిషయంలో తన విచారాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా పోస్ట్ పెట్టారు తెలంగాణ మంత్రి. చంద్రబాబు అరెస్ట్ తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో తలసాని మంత్రిగా పని చేశారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన నేత పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరైంది కాదని..అధికారం ఎవరికి శాశ్వతం కాదని ట్వీట్ చేశారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఒక మంత్రి హోదాలో ఉంటూ రూ.6 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న గజదొంగ చంద్రబాబు అరెస్టును సమర్థించడం ఏమిటి? నైపుణ్య శిక్షణ ఇచ్చే పేరుతో రూ.371 కోట్ల కుంభకోణానికి పాల్పడి, యువత భవిష్యత్తును అంధకారం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. అలాంటి వ్యక్తిని సమర్థించడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు?’ అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు, తలసాని ద్వంద్వ వైఖరి అంటూ గతంలో చంద్రబాబును విమర్శించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. హైదరాబాద్‌ను నేను నిర్మించానని చెప్పే చంద్రబాబు నాలుగున్నరేళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేదు? జపాన్, సింగపూర్ అంటూ చంద్రబాబు రాజధాని కోసం 33వేల ఎకరాలు సమీకరించి కూడా నిర్మించలేదని మండిపడిన వీడియోను పోస్ట్ చేసింది.