ఆంధ్ర ప్రదేశ్ లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో దాదాపు ప్రతి చోటా నాయకులకు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. చాలా వరకు ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంపై నిలదీస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ల విషయంలో ఎమ్మెల్యేలను కడిగిపారేస్తున్నారు. దాదాపు ప్రజాప్రతినిధులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సహనం కోల్పోయి ప్రవర్తిస్తూ పార్టీకి ఎసరు తెస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఎదురైంది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ కి.
‘‘ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలి.. వెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయ’’ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అన్నవరంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ లో పాల్గొన్న ఆయన.. పలువురి ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వం అందించిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. మీకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు వంటివన్నీ జగన్ ప్రభుత్వంలో వైఎస్‌ఆర్ పార్టీ ఇచ్చిందన్నారు.