కీలకమైన ఎన్నికల ముందు‌ సొంత కేడరే‌ ఎమ్మెల్యేకి‌ షాకిచ్చిందా..!

-

అసెంబ్లీ ఎన్నికల మాదిరే పంచాయతీ ఎన్నికల్లోనూ దూసుకుపోయారు అధికారపార్టీ యువ ఎమ్మెల్యే. మాజీ మంత్రికి చుక్కలు చూపిస్తూ ఎక్కడ చాన్స్ ఇవ్వకుండా నియోజకవర్గం పై పట్టు సాధించారు. కానీ‌ చివరి‌ విడత ఎన్నికల్లో సొంత పార్టీ కేడర్‌ ఇచ్చిన షాక్‌తో ఎమ్మెల్యేకు మైండ్‌ బ్లాంక్‌ అయిందట. తమ అనుకున్న నేతలే ఏకంగా నాలుగు పంచాయతీల్లో పక్క పార్టీ అభ్యర్ధులను గెలిపించారట..మాజీ మంత్రికి‌ పట్టు చిక్కకుండా ఓ‌ పక్క ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ‌ నేతలే ప్రత్యర్ది పార్టీతో‌‌ కలవడం వెనుక జరిగిన ఆసక్తికర పరిణామాలు‌ తెలుసుకుని ఎమ్మెల్యే మరింత‌ షాకయ్యారట.


కృష్ణాజిల్లా మైలవరం రాజకీయాలు ఎప్పుడూ హాట్‌హాట్‌గానే ఉంటాయి. ఎన్నికలు లేకపోయినా వైసీపీ, టీడీపీ మధ్య వైరం ఉప్పు నిప్పులా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా మహేశ్వరరావు గత ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు ఉమా. రాజకీయంగా ఉమా, వసంత కుటుంబాల మధ్య వైరం ఉంది. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు సమయం నుంచి అది అలా కొనసాగుతోంది.

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే వసంత, దేవినేని ఉమా మధ్య ఆ ఫైట్‌ కనిపించింది. మైలవరంలో టీడీపీని, ఉమాను ఇరుకున పెట్టాలనే లక్ష్యంగా పల్లెపోరులో ఎమ్మెల్యే పావులు కదిపారు. నియోజకవర్గంలోని 60 పంచాయతీలలో కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 56 పంచాయతీలలో ఎన్నికలు జరగ్గా ఆరుచోట్ల టీడీపీ గెలిచింది. పక్కా వ్యూహంతో ఎన్నికలకు వెళ్లినా.. ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు ఎలా గెలిచారో ఎమ్మెల్యే వసంతకు తొలుత అర్థం కాలేదట. క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసిన తర్వాత.. వైసీపీ నేతలే దానికి కారణంగా గుర్తించారట ఎమ్మెల్యే.

వైసీపీకి పట్టున్న పంచాయతీలలో టీడీపీ మద్దతుదారులు గెలిచారు. ఇక్కడ జడ్పీటీసీ రేస్‌లో ఉన్న సొంత పార్టీ అభ్యర్థి వల్లే అలా జరిగిందని ఎమ్మెల్యే తెలుసుకున్నారట. టీడీపీ నేతలతో జడ్పీటీసీ క్యాండిడేట్‌ కయ్యానికి దిగడం వల్ల తెలుగు తమ్ముళ్లు కసిగా పనిచేశారట. దీంతో అక్కడ ఓటమికి కారణమైనవారి గురించి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు వసంత. అంతేకాదు.. టీడీపీ చేతికి చిక్కిన ఆ పంచాయతీలను వైసీపీ గూటికి తెచ్చేందుకు ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది.

మొత్తానికి మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఝలక్‌ ఇద్దామని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ నిర్ణయిస్తే.. దానికి భిన్నంగా వైసీపీ కేడర్‌ ప్రవర్తించడం ఆయనకు మింగుడు పడటం లేదట. ఏదో అనుకుంటే మరోదే అయిందని పార్టీ శ్రేణులపై వసంత గుర్రుగా ఉన్నారట. మైలవరం పరిణామాలపై అధికారపార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version