ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీలకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చుక్కలు చూపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీలు ఇప్పటి వరకు కేంద్రంపై పోరాటం చేసిన సందర్భం ఒక్కటి కూడా కనపడలేదు. గత పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను సాధిస్తారని అందరూ భావించారు. కనీసం కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంటుందని ఊహించారు.
కాని అది కూడా ఎక్కడా జరగలేదు. రామయపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ నిధులు, పోలవరం బాకీలు, రాజధాని గ్రాంట్, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇలా చాలా వరకు అలాగే వెనుకబడిన జిల్లాలకు సంబంధించి నిధులు, తెలంగాణాలో ఉన్న ఆస్తులు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, ఆర్ధిక లోటు సహా కీలక అంశాలు వైసీపీ నేతల ముందు ఉన్నాయి అనేది వాస్తవం.
ఈ నేపధ్యంలో వాళ్ళు ఎంత వరకు కేంద్రాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. రాజ్యసభలో పార్లమెంటరి పక్ష నేత విజయసాయి రెడ్డి, లోక్సభలో ఆ పార్టీ పక్ష నేత మిథున్ రెడ్డి మినహా ఎవరూ కూడా మాట్లాడే పరిస్థితి కనపడటం లేదు. మాట్లాడినా సంబంధం లేని విషయాల మీద వాళ్ళ ప్రసంగాలు ఉంటున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర కష్టాలను ఏ విధంగా ప్రస్తావిస్తారో చూడాలి.
ఇక పౌరసత్వ సవరణ చట్టం మీద వాళ్ళ వైఖరి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. రాయలసీమ సహా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి వైసీపీ ఏ మేర దీనిపై తన వైఖరిని చెప్తుందో చూడాలి. 23 మంది ఎంపీలు ఉన్నారు. వారందరి మీద చాలా ఆశలు రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి. తెలుగుదేశం సోదిలో లేదు కాబట్టి పెద్ద సమస్య లేదు. మరి వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.