కరోనా ప్రభావంతో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సైట్ యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో వీడియోల డిఫాల్ట్ స్ట్రీమింగ్ క్వాలిటీని 480పి గా సెట్ చేస్తూ యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూజర్లు యూట్యూబ్‌లో ఏ వీడియోనైనా సరే డిఫాల్ట్‌గా 480పి క్వాలిటీతో వీక్షిస్తారు. అయితే అవసరం అనుకుంటే క్వాలిటీని తమకు నచ్చినట్లు మార్చుకోవచ్చని యూట్యూబ్ తెలిపింది.
కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇండ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్నెట్‌పై, తమ సర్వర్లపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఇప్పటికే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు తమ యాప్‌లలో వీడియోల డిఫాల్ట్ స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించాయి. అందులో భాగంగానే యూట్యూబ్ కూడా తన సైట్‌లో ఉన్న వీడియోల డిఫాల్ట్ స్ట్రీమింగ్ క్వాలిటీని తగ్గించింది.
గతంలో కేవలం యూరప్‌లోనే ఆయా సైట్లు వీడియోల క్వాలిటీని తగ్గించాయి. కానీ ఇప్పుడు ప్రపంచమంతటా వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు తమ తమ యాప్‌లలో వీడియోల క్వాలిటీని తగ్గిస్తున్నాయి. కరోనా కారణంగా ఇండ్లలోనే ప్రజలు ఉంటుండడంతో వీడియో స్ట్రీమింగ్ యాప్‌లు, ఇంటర్నెట్‌లో వారు ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. దీంతో తమ సర్వర్లపై భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. ఇక ఈ నిర్ణయం ఏప్రిల్ 14వ తేదీ వరకు అమలులో ఉంటుందని యూట్యూబ్ తెలిపింది.