ఈరోజు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని, ఏ సమస్య వచ్చినా 72 గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా మీరు పనిచేయాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. వాలంటీర్లతో కలిసి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలి.
అధికారం చలాయించడం కోసం ఉద్యోగం కాదు ప్రజల కోసం పనిచేసే బాధ్యతగా ఉండాలని చెప్పుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇలాంటి మంచి అవకాశాన్ని దక్కించుకున్న మీరంతా మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి. లంచాలు, వివక్ష లేకుండా పారదర్శకతగా పనిచేయాలి. మనకు ఓటేయని వారు కూడా మళ్లీ వచ్చే ఎన్నికల్లో మనకే ఓటు వేసేలా మీరంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్ అండ్ కాంగ్రాట్స్ తెలిపారు.