మెట్రో ప్రయాణీకులకు శుభవార్త. 50 శాతం డిస్కౌంట్ అందిస్తున్న మెట్రో రైల్ యాజమాన్యం. చెన్నై, భారతదేశంలోని మొదటి ఐదు మెట్రో నగరాల్లో ఒకటి. చెన్నై మెట్రోలో రోజుకు సగటున 1.2 లక్షల మంది ప్రయాణిస్తుండగా… ఆదివారాలు, సెలవు దినాల్లో ఈ సంఖ్య అమాంతం 70 వేలకు పడిపోతోంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ఇకపై సెలవు దినాల్లో 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని చెన్నై మెట్రో రైల్ యాజమాన్యం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ డిస్కౌంట్ కొన్ని నెలల పాటు లేదా ఓ సంవత్సరం పాటు కొనసాగిస్తారని చెబుతున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశకు చేరుకోగా.. త్వరలోనే చెన్నై మెట్రో రైల్ బోర్డు ముందుకు చేరనున్నాయి. 2017లో మెట్రో యాజమాన్యం ఓ వారం రోజుల పాటు 40 శాతం డిస్కౌంట్ అమలు చేయడంతో ప్రయాణికుల సంఖ్య 67 శాతం పెరిగింది. 2017 దీపావళి సందర్భంగా కూడా చెన్నై మెట్రో 20 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా ప్రాయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం 50 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.