ఏపీ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో దగ్గుబాటి దంపతుల వ్యవహారంతో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మ్యాటర్ పెద్ద హాట్‌టాపిక్‌గా మారాయి. దగ్గుబాటి వెంకటేశ్వరరావును వైసీపీని వీడడం దాదాపు ఖాయమైతే… అటు వంశీ వైసీపీ ఎంట్రీ ఖాయమైంది. ఇక టీడీపీ బలబలాపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చిన జగన్ ఆ పార్టీ ఆయువు పట్టుమీద కొట్టాలని డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం టీడీపీకి యూత్ బలం లేదు. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లే ఇంకా పార్టీని పట్టుకుని వేలాడుతున్నారు. వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన కొందరు కీలక నేతలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ పార్టీని పెట్టుకున్నప్పుడు జగన్‌ను తక్కువ అంచనా వేసిన వారందరు ఇప్పుడు నాలిక కరచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు రెక్కలు విరిచేయాలంటే ఆయనకు నమ్మకస్తులుగా ఉన్న సీనియర్లలో కొందరిని తన వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టుల కరణం బలరాం ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఇప్పటికే తన వారసుడి రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. తన వారసుడు వెంకటేష్‌కు ప్రకాశం జిల్లా జడ్పీచైర్మన్ సీటుపై హామీ ఇస్తే ఆయన ఇప్పుడే కండువా మార్చేస్తారంటున్నారు.
ఈ క్రమంలోనే మరో సంచలన వార్త కూడా ఇప్పుడు తెరమీదికి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి వరుసగా రెండో సారి విజయం సాధించిన మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను కూడా పార్టీలోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నారట. ఆయన దశాబ్దాలుగా తూర్పుగోదావరి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన్ను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి మరీ మళ్లీ పోటీ చేయించాలని.. అంతకంటే ముందే మంత్రి పదవి కూడా ఆఫర్ చేయాలని కూడా జగన్ వైసీపీ వర్గాల ద్వారా వర్తమానం పంపినట్టు తెలుస్తోంది.
ఒక వేళ ఎన్నికల్లో ఓడినా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిని చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చారట. ఈ వార్త ఇప్పుడు వైసీపీ వర్గాల్లోనూ సంచలనంగా మారింది. ఈ పరిణామంతో టీడీపీలోని చాలా మంది సీనియర్లు వైసీపీ వైపు దృష్టి సారిస్తారనే వ్యూహం కూడా వైసీపీలో ఉందని చెబుతున్నారు. మరి బాబుకు అత్యంత నమ్మకస్తుడు అయిన చినరాజప్ప డెసిషన్ ఎలా ఉంటుందో ? చూడాలి.