వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన మొదటి నుంచి ఓ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ప్రతి సమస్యలో కేసీఆర్‌ను వేలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సందర్భానికి తగ్గట్టు విమర్శలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే నిరుద్యోగమే తన ప్రధాన ఎజెండా అని చెప్పకనే చెప్తున్నారు ఆమె. ఇప్పటి వరకు నిరుద్యోగంపైనే ఆమె ఎక్కువగా మాట్లాడుతున్నారు.
ఇంకోవైపు కరోనా సమయంలో కూడా ఆరోగ్య శ్రీలో కరోనా ట్రీట్‌మెంట్‌ను చేర్చాలనడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పన లాంటివి ఆమె డిమాండ్లలో చెప్పుకోదగ్గవి. ఆనీ ఆమె ఎక్కువగా నిరుద్యోగ యువతను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నోటిఫికేషన్లు లేక ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కూడా ఆమె నిరుద్యోగ యువకులను టార్గెట్ చేస్తూ నల్లగొండకు పయనమవుతున్నారు. హుజూర్‌నగర్‌లో నోటిఫికేషన్ లేక ఆత్మహత్య చేసుకున్న నీలకంఠసాయి అనే యువకుడిన కుటుంబాన్ని పరామర్శిస్తారు. వారితో పాటు రీసెంట్‌గా మృతి చెందిన వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత అయిన నాగిరెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. ఇందుకు పెద్ద ఎత్తున నిరుద్యోగులు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో నాయకులు, వైఎస్సార్ అభిమానులతో ఆమె మంతనాలు జరుపుతారు.