గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా కేసుని సిబిఐ కి బదిలీ చెయ్యాలనే డిమాండ్ వినపడుతున్న సంగతి తెలిసిందే. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి అంటే ప్రభుత్వం సిబిఐ కి బదిలీ చేస్తేనే సాధ్యమనే డిమాండ్ వినపడింది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా హత్య కేసుని సీబీఐకి బదిలీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. కేసు విచారణ తుది దశలో ఉందన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇలాంటి సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు… కేసును ఈ నెల 20కి వాయిదా వేసింది.
తదుపరి విచారణ ముగిసేవరకు తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయొద్దని సిట్ కు హైకోర్టు ఆదేశాలు జరీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 19లోగా వైఎస్ వివేకా భార్య వేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో ఎక్కువగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఆరోపణలు చేసింది వైసీపీ. తన ప్రమేయం ఉందని తేలితే ఉరేసుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు.