10 కోట్ల మంది భార‌తీయుల క్రెడిట్‌, డెబిట్ కార్డుల వివ‌రాలు డార్క్ వెబ్‌లో విక్ర‌యం

-

వినియోగ‌దారుల‌కు చెందిన వ్య‌క్తిగ‌త‌, బ్యాంకింగ్ వివ‌రాల‌ను స‌ర్వ‌ర్ల‌లో కాపాడ‌డం అనేది ఇప్పుడు కంపెనీల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. హ్యాక‌ర్లు ఆయా వివ‌రాల‌ను చాలా సులువుగా సేక‌రించి త‌మ సొంత ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకోవ‌డమో లేదా ఇత‌రుల‌కు అమ్మ‌డ‌మో చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌స్‌పే అనే ఓ పేమెంట్ గేట్‌వే సంస్థ‌కు చెందిన 10 కోట్ల యూజ‌ర్ల డేటా ఇప్పుడు డార్క్ వెబ్‌లో అమ్ముడ‌వుతుంద‌ని ఇండిపెండెంట్ సైబ‌ర్ సెక్యూరిటీ రీసెర్చ‌ర్ రాజ‌శేఖ‌ర్ రాజ‌హ‌రియా తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

డార్క్ వెబ్‌లో 10 కోట్ల మంది భార‌తీయుల‌కు చెందిన క్రెడిట్‌, డెబిట్ కార్డుల వివ‌రాల‌తో కూడిన డేటా అమ్ముడ‌వుతుంద‌ని, హ్యాక‌ర్లు బిట్‌కాయిన్ల‌ను ఉప‌యోగించి ఆ డేటాను కొనుగోలు చేస్తున్నార‌ని, అందుకు గాను టెలిగ్రాం వంటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌ను వారు వాడుతున్నార‌ని ఆయ‌న తెలిపారు. జ‌స్‌పే అనే పేమెంట్ గేట్‌వే సంస్థ‌కు చెందిన యూజ‌ర్ల డేటా చోరీకి గురైంద‌న్నారు.

అయితే ఇదే విష‌యంపై జ‌స్‌పే స్పందించింది. ఆగ‌స్టు 18, 2020న కొంద‌రు హ్యాక‌ర్లు త‌మ స‌ర్వ‌ర్ల‌లోని కార్డుల వివ‌రాల కోసం డేటాను చోరీ చేసేందుకు య‌త్నించిన మాట వాస్త‌వ‌మేన‌ని తెలిపింది. అయితే విష‌యాన్ని వెంటనే తెలుసుకుని ఆ ప్రాసెస్‌ను అడ్డుకున్నామ‌ని, అందువ‌ల్ల డేటా చౌర్యం ఏమీ జ‌ర‌గ‌లేద‌ని, అయితే కొంద‌రు యూజ‌ర్ల‌కు చెందిన ఈ-మెయిల్ ఐడీలు, ఫోన్ నంబ‌ర్ల వివ‌రాలు లీకై ఉండ‌వచ్చ‌ని అభిప్రాయ‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ఆ వివ‌రాల‌ను డార్క్ వెబ్‌లో కొనుగోలు చేస్తున్నార‌ని రాజ‌శేఖ‌ర్ రాజ‌హ‌రియా తెల‌ప‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version