రెండ్రోజుల్లో ట్విటర్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తి : ఎలాన్ మస్క్

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలులో వేగం పెంచారు. అక్టోబర్ 28 నాటికి ట్విటర్ కొనుగోలు ప్రక్రియ ముగిస్తానని బ్యాంకర్లకు తెలిపారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు.

ట్విటర్‌ను మస్క్‌ 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీంట్లో 13 బిలియన్‌ డాలర్లు బ్యాంకుల నుంచి సమకూర్చుకుంటున్నారు. పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అందులో భాగంగా పలు బ్యాంకర్లతో చర్చలు జరిపారు. ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ కీలక వ్యక్తి తెలిపారు. బ్యాంకులు సంబంధిత పత్రాలపై సంతకం చేస్తే మస్క్‌ ఖాతాలోకి నిధులు బదిలీ కావడమే తరువాయి అని చెప్పారు.

ట్విటర్‌ కొనుగోలుకు కావాల్సిన నిధులను అందిస్తున్న బ్యాంకుల్లో మోర్గాన్‌ స్టాన్లీ, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, బార్‌క్లేస్‌, ఎంయూఎఫ్‌జీ, బీఎన్‌పీ పరిబస్‌, మిజుహో, సోషియేట్‌ జనరేల్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నట్లు గతంలో బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. కొనుగోలు విషయంలో మస్క్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆయా బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేశాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version