వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్.. ఇక నుంచి ఆ ఫొటోలు స్క్రీన్ షాట్ తీయలేరు..!

-

రోజుకో ఫీచర్ తో యూజర్స్ ని ఆకర్షిస్తోంది వాట్సాప్. యూజర్లకు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందించాలనే లక్ష్యంతో వాట్సాప్ ఇప్పటికే సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. తాజాగా మరికొన్ని ట్రెండీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చి యూజర్స్ ను సర్ ప్రైజ్ చేయడానికి వాట్సాప్ కంపెనీ రెడీ అవుతోంది. ఇంతకీ ఆ కొత్త ఫీచర్స్ ఏంటో చూద్దామా..!

 

నచ్చిన భాషలో యాప్‌.. వాట్సాప్ ఉపయోగించే యూజర్లలో చాలా మంది యాప్‌ లాంగ్వేజ్‌తో ఇబ్బంది పడుతుంటారు. దీంతో పూర్తిస్థాయిలో ఫీచర్లు, సెట్టింగ్స్‌ను ఉపయోగించలేరు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా వాట్సాప్‌ లాంగ్వేజ్‌ సెట్టింగ్స్‌లో మార్పులు చేయనుంది. దీంతో యూజర్లు యాప్‌ లాంగ్వేజ్‌గా తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. ఈ మేరకు యాప్‌ సెట్టింగ్స్‌లో చాట్‌ సెక్షన్‌లోకి వెళ్లి యాప్‌ లాంగ్వేజ్‌పై క్లిక్ చేసి అనుకూలమైన భాషను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొద్ది మంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ప్రొఫైల్‌ డిస్‌ప్లే.. వాట్సాప్‌ గ్రూపులో ఎవరైనా మెసేజ్‌ పంపితే, వాళ్ల ఫోన్‌ నంబర్‌ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్‌ అయితే ఎవరు పంపారనేది తెలుస్తుంది. ఒకవేళ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేకుంటే కేవలం వారి ఫోన్ నంబర్‌ మాత్రమే డిస్‌ప్లే అవుతుంది. కొత్తగా రాబోతున్న ఫీచర్‌తో గ్రూపులో మెసేజ్‌ పంపిన యూజర్‌ ప్రొఫైల్‌ ఫొటో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది.

స్క్రీన్‌షాట్‌ తీయలేరు.. వాట్సాప్‌లో వ్యూవన్స్‌ ఫీచర్‌ ద్వారా పంపే ఫొటో లేదా మీడియా ఫైల్స్‌ను ఒక్కసారి చూసిన తర్వాత వాటంతటవే డిలీట్ అవుతాయి. దీంతో సదరు ఫైల్‌కు సంబంధించి అవతలి వ్యక్తి వద్ద ఎలాంటి డిజిటల్‌ రికార్డులు ఉండవు. ఇది ఈ ఫీచర్‌ ముఖ్య ఉద్దేశం. కానీ, కొద్దిమంది యూజర్లు వ్యూవన్స్‌ ద్వారా పంపిన ఫొటోలను స్క్రీన్‌షాట్‌ తీసుకుంటున్నారు. ఇకపై వ్యూవన్స్‌ ద్వారా పంపే ఫొటోలను స్క్రీన్‌షాట్‌ తీసుకోకుండా.. స్క్రీన్‌ షాట్ బ్లాకింగ్ ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు పరిచయం చేయనుంది.

కమ్యూనిటీస్‌.. వాట్సాప్‌లో కమ్యూనిటీస్ అనే మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్ ఏప్రిల్‌లో వెల్లడించారు. దీంతో ఈ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా.. అని యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు కమ్యూనిటీస్‌ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పది గ్రూపులను క్రియేట్ చేయొచ్చు. వీటిని సబ్‌ గ్రూపులు అని పిలుస్తారు. దీంతో ఒకేసారి 512 మంది కమ్యూనిటీస్‌లో సభ్యులుగా ఉండొచ్చు. కమ్యూనిటీస్‌లోని సభ్యులు తమకు నచ్చిన సబ్‌ గ్రూపులలో సభ్యులుగా చేరొచ్చు. సబ్‌ గ్రూప్‌లను డిసేబుల్, ఎనేబుల్ చేసే అధికారం కమ్యూనిటీస్‌ అడ్మిన్‌కు ఉంటుంది. దాంతోపాటు సబ్‌ గ్రూపులోని సభ్యుల ఫోన్‌ నంబర్లు ఇతరులకు కనిపించకుండా గోప్యతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది.

ఒక్క క్లిక్‌తో రికవరీ.. వాట్సాప్‌లో పొరపాటున ఏదైనా మెసేజ్‌ డిలీట్ చేస్తే వాటిని తిరిగి రికవరీ చేసుకునే అవకాశంలేదు. త్వరలో తీసుకురాబోతున్న ఫీచర్‌తో డిలీట్ చేసిన మెసేజ్‌, మీడియాఫైల్స్‌ను కూడా తిరిగి పొందవచ్చు. మెసేజ్‌ డిలీట్ చేసిన వెంటనే చాట్ స్క్రీన్‌ మీద మెసేజ్‌ డిలీటెడ్ (Message Deleted) లైన్‌తోపాటు అన్‌డూ (UNDO) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. అన్‌డూపై క్లిక్ చేస్తే డిలీట్ చేసిన మెసేజ్‌ తిరిగి చాట్ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. మెసేజ్‌ డిలీట్ చేసేప్పుడు యూజర్ డిలీట్ ఫర్‌ మీ (Delete For Me) అనే ఆప్షన్‌ సెలెక్ట్ చేస్తే అన్‌డూ ఆప్షన్‌ కనిపించదు. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ (Delete For Everyone) ఆప్షన్‌ ద్వారా డిలీట్ చేసిన మెసేజ్‌లకు మాత్రమే అన్‌డూ ఆప్షన్‌ చూపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version