ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ను ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్న తర్వాత ఆ సంస్థలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల తొలగింపు నుంచి బ్లూటిక్ కు ఛార్జ్ చేయడం.. లోగో మార్పు.. ఇప్పుడు ఏకంగా సైట్ మార్పు.. ఇలా ప్రతి దశలో తన ప్రతి నిర్ణయంతో యూజర్లకు షాక్ ఇస్తూనే ఉన్నారు మస్క్. ట్విటర్ ను త్వరలోనే ఓ సూపర్ యాప్ గా రూపాంతరం చెందేలా చర్యలు చేపడుతున్నామని మస్క్ ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగా దాని పేరును ‘ఎక్స్.కామ్’గా మార్చారు. లోగోలోని పిట్టను పక్కన పెట్టి ‘ఎక్స్’ చేర్చారు.
అయితే ట్విటర్ పేరు మార్చడం వల్ల మస్క్ కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఈ పేరుతో ఓ పోర్న్‌సైట్ ఉండటంతో ఇండోనేసియాలో దాన్ని నిషేధించారు. ఇప్పుడు ఈ డొమైన్ ఆ దేశంలో అందుబాటులో లేదు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఇండోనేసియా కమ్యూనికేషన్, ఇన్ఫర్మేటిక్స్ అధికారులు ‘ఎక్స్’ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు.