మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. కొంతమంది ఇది కూడా చేయించుకోరు. కేవలం అగ్రిమెంట్ పేపర్స్‌తోనే ఉంటారు. రిజిస్ట్రేష్ చేయించడానికి కాస్త ఖర్చు అవుతుంది. అయినా ప్రాపర్టీ మన పేరు మీద ఉన్నట్లు చూపించే ఆధారం కేవలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాత్రమే. అయితే రిజిస్ట్రేషన్ ఒక్కటే చేయించుకుంటే సరిపోదు మ్యూటేషన్ కూడా చేయించుకోవాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. మీకు ఆ భూమి లేదా ఇళ్లు అమ్మినవాడు మీకు ఒక్కరికే అమ్మారన్నా గ్యారెంటీ ఏంటీ.. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు.. ఒకటే భూమిని ఇద్దరు ముగ్గురికి రిజిస్ట్రేషన్ అయి ఉంది. మాది అంటే మాదని వాళ్లు గొడవపడాతరు. ఇలాంటివి జరగొద్దు అంటే… ప్రోపర్టీ కొన్నప్పుడు మ్యూటేషన్ కూడా కచ్చితంగా చేయించుకోవాలి.
ఆస్తిని ప్రాపర్టీ మ్యుటేషన్‌ని చేయించాలి. ప్రాపర్టీ మ్యుటేషన్ అంటే, సంబంధిత తహశీల్దార్ ఆఫీసులో ఆర్ఓఆర్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఓఆర్ అంటే, రెవిన్యూ శాఖ వారు నిర్వహించే ” రికార్డ్ ఆఫ్ రైట్స్ ” అని అర్థం. మన భాషలో చెప్పాలంటే భూమి యాజమాన్య హక్కుల రికార్డు అని అర్థమన్నమాట.
మ్యూటేషన్ సేల్ డీడీ ఒకటేనా..?
కొంతమంది మ్యుటేషన్, సేల్ డీడ్.. రెండూ ఒకటేనని భావిస్తారు. కానీ వాస్తవానికి ఆ రెండూ వేర్వేరు. సేల్ డీడ్ అనేది విక్రయానికి సంబంధించిన ఒప్పంద పత్రం లాంటిది మాత్రమే. కానీ మ్యుటేషన్ మాత్రం రెవిన్యూ శాఖ నిర్వహించే అధికారిక ప్రక్రియల్లో ఒకటి. ఈ మ్యుటేషన్ పూర్తి కానంత వరకు రెవిన్యూ శాఖ వద్ద ఉన్న అధికారిక రికార్డులలో మీరు కొన్న భూమి మీ పేరు పైకి బదిలి కానట్టే. అలాగే, మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే ముందు ఆ ఆస్తి ఎవరి పేరు మీద ఉందో ముందుగానే చూసుకోవాలి. అంతేకాకుండా ఆ ఆస్తి పేరు మీదు ఎవరైనా రుణం తీసుకున్నారా అనే విషయం కూడా క్రాస్ చెక్ చేసుకుంటే తరువాత ఎలాంటి ఇబ్బందులు రావు.
వ్యవసాయ భూమి అయితే మండల రెవిన్యూ అధికారి మ్యుటేషన్ చేస్తారు. అన్నీ రాష్ట్రాల్లోనూ ఎంఆర్వోలను తహశీల్దార్ అనే పిలుస్తారు. ఒకవేళ మీరు కొనుగోలు చేసింది నివాస భూమి అయితే, సంబంధిత గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నివాస భూమి పేరు మార్చడం జరుగుతుంది.