వాట్సప్.. ఇప్పడు ప్రజల జనజీవితాల్లో బాగా చొచ్చుకెళ్లిన సామాజిక మాధ్యమం.. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సప్ తో ఎంతో అనుబంధం ఏర్పడి పోయింది. ఉదయం లేచింది మొదలు వాట్సప్ చూడకుండా చాలా మంది జనం బతకలేని పరిస్థితి ఏర్పడిపోయింది. దీనికి పేద, ధనిక బేధంలేదు.. చదువు సంధ్య తేడా లేదు..
స్నేహితుల గ్రూప్, ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ , ఆఫీసు గ్రూప్.. బాల్య స్నేహితుల గ్రూప్.. పార్టీల గ్రూప్.. ఇలా ఎన్ని గ్రూపులో.. దీనికితోడు స్టేటస్ లు.. ఎప్పటికప్పుడు స్టేటస్ లు చెక్ చేసుకోవడం.. కౌంటర్లు ఇవ్వడం మామూలుగా లేదు వాట్సప్ క్రేజ్.. అయితే అదే క్రేజ్ వివాదాలకూ కారణమవుతోంది.
వాట్సప్ స్టేటస్ నచ్చక ఏకంగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా.. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఓ వ్యక్తి పోస్ట్ చేసిన వాట్సాప్ స్టేటస్ కాల్పులకు దారితీసింది. ఇర్షాద్ అనే యువకుడు స్థానిక రాజకీయాలకు సంబంధించి ఓ పోస్ట్ ను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. అయితే అది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంది.
అది కాస్తా ఆ ఏరియా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుహేల్ కందక్ కు నచ్చలేదు. అసలే ముక్కోపి.. అంతే.. ఆవేశంగా ఓ గ్యాంగ్ ను వేసుకుని ఇర్షాద్ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. అయితే ఇర్షాద్ కూడా తగ్గలేదు. దీంతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఇదే క్రమంలో సుహేల్ కందక్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో ఇర్షాద్ గాయపడ్డాడు.
ఇర్షాద్ కు గాయం కావడంతో రెచ్చిపోయిన అతడి వర్గీయులు.. సుహేల్ ను చితకబాదారు. సీన్ రివర్స్ కావడంతో కాలికి బుద్ది చెప్పాడు సుహేల్. ఆ తర్వాత గాయపడిన ఇర్షాద్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి ఇర్షాద్ పెట్టిన ఓ వాట్సప్ స్టేటస్ పోస్టు ఏకంగా కాల్పులకు దారి తీసింది. అందుకే వాట్సప్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టండి.