టెర్రరిస్ట్ ప్రభావిత రాష్ట్రాల హోం మంత్రులతో సమావేశమైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల హోంశాఖ మంత్రులతో సమావేశం కానున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి గారి అపాయింట్మెంట్ దొరికితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరై తమ మధ్య సన్నిహిత, సుహృద్భావ వాతావరణం ఉన్నట్లుగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని, ఈ నిమిషం వరకు జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి అపాయింట్మెంట్ లభించలేదని తెలిపారు.
రాష్ట్ర హోంశాఖ మంత్రుల సమావేశానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి విచ్చేస్తున్నట్లు కూడా తెలియదు కదూ అంటూ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను రఘురామకృష్ణ రాజు ప్రశ్నించగా, వారు అవునని సమాధానం చెప్పారు. ప్రధాని గారు, కేంద్ర హోం శాఖ మంత్రి గారి అపాయింట్మెంట్ దొరకకపోతే ప్రజాసేవలో బిజీగా ఉండి నిరంతర ప్రజాసేవ తత్పరుడైన జగన్ మోహన్ రెడ్డి గారు తన ఢిల్లీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారని సాక్షి మీడియాతో పాటు, ఇతర బ్లూ చానల్స్ లలో వార్తా కథనాలను ప్రసారం చేస్తారని అన్నారు. ముఖ్యమంత్రి గారికి అందిన నివేదిక ప్రకారం రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి 51 సీట్లు వస్తాయని ఎవరో అన్నట్లుగా తెలిసిందని, అద్దంలో చూసుకుంటే 15 కాస్తా జగన్ మోహన్ రెడ్డి గారికి 51 గా కనిపించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.