ప్రముఖ పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ లైవ్ కాన్సర్ట్‌కు తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం శంషాబాద్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన దిల్జిత్ సింగింగ్ ప్రోగ్రామ్‌కు సైబరాబాద్ పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. లైవ్‌లో స్టేజ్‌పై చిన్నారులను ముందు పెట్టి షో చేయరాదని సూచించారు. అంతేకాకుండా, మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించే పాటలు పాడకూడదని, పరిమితికి మించి సౌండ్ పెట్టరాదని ఆంక్షలు విధించారు.
నిబంధలనకు విరుద్ధంగా ప్రోగ్రామ్ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ పోలీసులు నిర్వాహకులను హెచ్చరించారు. డీజే విషయంలో ఇరుగు పొరుగుకు ఇబ్బంది కలుగరాదని, ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కాగా, దిల్జిత్ లైవ్ కాన్సర్ట్ కోసం పెద్ద ఎత్తున యువతీయువకులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు కూడా విధించనున్నట్లు సమాచారం.