ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ నిర్మల్ జిల్లా దిలావర్పూర్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడంతో రేవంత్ సర్కార్ దిగొచ్చిన విషయం తెలిసిందే.ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ అనుమతులపై పునరాలోచిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫ్యాక్టరీ నిర్మాణ పనులను సైతం నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఈ వ్యవహారంపై స్పందించడం లేదని రైతులు ఆందోళన చేయగా.. తాజాగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం ప్రెస్ నోట్ విడుదల చేశారు.
గతంలో సదరు పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలని అధికారులతో మాట్లాడానని, ఈ సమస్యపై గుండంపల్లి రైతులందరితో చర్చించి, న్యాయపరంగా పోరాడుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. ఫ్యాక్టరీ గురించి దిలావర్పూర్ జేఏసీ నేతలతో రెండు సార్లు చర్చించినట్లు గుర్తు చేశారు.ఈ సమస్య గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లానని, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తుంది కావున ప్రజలు కాస్త సంయమనం పాటిస్తే శాంతియుతంగా పోరాడుదాం అని అన్నారు. తాను సైతం దిలావర్పుర్ ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని, ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని.. వారి కోసమే నేను ఉన్నానని.. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయే వరకు చర్యలు తీసుకుంటానని తేల్చి చెప్పారు.