కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇటీవల కాగజ్‌నగర్ మండలంలోని ఓ పత్తి చేనులో పనిచేస్తున్న యువతిపై పెద్దపులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. పెద్దపులి జాడ కోసం ఫారెస్టు అధికారులు, పోలీసులు ప్రత్యేక బృందాలు, డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు.
పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఈ క్రమంలోనే సిర్పూరు టౌన్ దుబ్బగూడ సమీపంలో తన పొలంలో పత్తి ఏరుతున్న రౌతు సురేశ్ అనే రైతుపై పెద్దపులి వెనుక నుంచి దాడి చేసింది. అతన్ని భార్య గట్టిగా కేకలు వేయడంతో స్థానికంగా పొల్లాల్లో ఉన్న వారు అక్కడి చేరుకుని గట్టిగా కేకలు వేయగా.. పులి పారిపోయింది.ప్రస్తుతం సురేశ్ మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పులి వరుస దాడులకు అప్రమత్తమైన రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు.